- సంపత్ కుమార్ ‘సెల్ఫ్ గోల్’ చేసుకుంటున్నారా?
- తాండూరులో డాక్టర్ సాబ్ గ్రాఫ్ డౌన్.. సొంత నిర్ణయాలే మైనస్ అవుతున్నాయా?
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన సంపత్ కుమార్ (డాక్టర్ సాబ్) ప్రస్థానం ఇప్పుడు సంకట స్థితిలో పడిందా? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో మైలేజ్ పెంచడం పక్కన పెడితే, ఉన్న క్రేజ్‌ను కూడా పాతాళానికి పడిపోయేలా చేస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది తాండూరు ఓటర్ల నుంచి!గత ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంలో చక్రం తిప్పిన సంపత్ కుమార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు సంచలనం కంటే ఎక్కువగా విమర్శలకు దారితీస్తున్నాయి. తన అనుచరులను పార్టీలోకి తీసుకోవడం లేదన్న నెపంతో పార్టీని వీడాలనుకోవడం ‘స్వార్థ రాజకీయమే’ తప్ప ప్రజా సేవ కాదని జనం పెదవి విరుస్తున్నారు. గతంలో ఉన్న పట్టు ఇప్పుడు లేదని, ప్రజల నాడి పట్టుకోవడంలో డాక్టర్ సాబ్ విఫలమవుతున్నారని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియని ఆయన తీరుతో సామాన్య ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరని విశ్లేషకులు భావిస్తున్నారు.డాక్టర్ సాబ్ అంటే ఒక బ్రాండ్.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతోంది అని ఆయన పాత మిత్రులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తును తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారని, ఇది ఆయన రాజకీయ జీవితానికి ‘బిగ్ మైనస్’ అని జనం అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం తాండూరులో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఆయన వేరే పార్టీలోకి వెళ్తే మాత్రం అక్కడ కూడా ఇమడగలరా? లేక తన వర్గంతో విడిగా ఉంటే ప్రజలు ఆదరిస్తారా? ఏది ఏమైనా, తన పాత వైభవాన్ని కోల్పోతున్న సంపత్ కుమార్, ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికే కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది.మొత్తానికి, తాండూరు ‘కింగ్ మేకర్’ ఇప్పుడు రాజకీయ చదరంగంలో ఒక తప్పు స్టెప్ వేసి తన ఇమేజ్‌ను తానే దెబ్బతీసుకుంటున్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.






