కేటీఆర్‌ను ముట్టుకునే దమ్ముందా..!

- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందే!
- కవితను జైలుకు పంపింది మేమే..
- రాహుల్ యాత్రకు బస్సులిచ్చింది బీఆర్‌ఎఎస్ఏ
తాండూరు జానవాహిని ప్రతినిధి :
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉన్నది చీకటి ఒప్పందమేనని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“కేటీఆర్‌ను లోపలేసే దమ్ము మీకు లేదు”
లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా ప్రశ్నించారు. “కేటీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కానీ, తప్పు చేసిన కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి, చట్టం ముందు నిలబెట్టిన ఘనత బీజేపీదే” అని ఆయన గుర్తుచేశారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల బంధం ఈనాటిది కాదని, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ సమయంలోనే అది బయటపడిందని ఎద్దేవా చేశారు. రాహుల్ యాత్ర కోసం ఆర్టీసీ బస్సులను పంపింది బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లేనని, ఇదంతా ప్రజలకు తెలుసని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలో ఉన్నదంతా దోచుకున్నారని, ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో ఏమీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీస్తోందని ఆరోపించారు. “ఒకరు దోచుకున్నారు.. మరొకరు చేతులెత్తేస్తున్నారు,” అని మండిపడ్డారు.రాష్ట్రంలో రైతులు, సామాన్య ప్రజల కోసం నిలబడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కొండా స్పష్టం చేశారు. నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీ లు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు.



