
- తాండూరు మున్సిపాలిటీలో ‘ఓటరు’ గందరగోళం
- అధికారుల నిర్లక్ష్యంపై అభ్యర్థుల ఆగ్రహం..
- ఎన్నికల ప్రక్రియపై సర్వత్ర విమర్శలు
- పెండింగ్‌లో ఫిర్యాదులు.. ఓట్ల తొలగింపుపై వీడని సందిగ్ధత
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా వ్యవహారం రచ్చకెక్కుతోంది. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించి ఓటర్ల వివరాలను వెల్లడించడంలో మున్సిపల్ అధికారులు ప్రదర్శిస్తున్న అలసత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిర్వహణను బాధ్యతాయుతంగా చూడాల్సిన అధికారులు, ఈ ప్రక్రియను చాలా సులువుగా భావిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణలో భాగంగా వేల సంఖ్యలో ఓట్లు తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అక్రమంగా ఉన్న ఎన్ని ఓట్లను అధికారులు తొలగించారు?అభ్యర్థులు ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదుల్లో ఎన్నింటిని సవరించారు? అనే అంశాలపై మున్సిపల్ యంత్రాంగం నోరు మెదపడం లేదు. అర్హత ఉన్న ఓటర్ల పేర్లు గాలికి వదిలేసి, చనిపోయిన వారు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.అదేవిదంగా ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తున్నా, ఓటర్ల జాబితాను పిడిఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. 36 వార్డుల్లో మహిళలు, పురుషులు, ఇతరుల సంఖ్య ఎంత? కొత్తగా చేరిన ఓట్లు ఎన్ని? అనే డేటా లేకపోవడంతో అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి విచారణ జరిపి ఎన్ని ఓట్లు సవరించారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనది. అలాంటి జాబితా తయారీలోనే అధికారులు ఇంత అలసత్వం వహించడంపై రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ గందరగోళం పెరగకముందే, ఉన్నతాధికారులు స్పందించి సమగ్రమైన, సవరించిన ఓటరు జాబితాను వార్డుల వారీగా వెంటనే విడుదల చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



