posted on Jun 10, 2024 5:14PM
జగన్ సర్కార్ అరాచకానికి రాష్ట్రంలో ఎందరో బాధితులుగా మారిపోయారు. ఇంకెంతో మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు అనాథలుగా మిగిలాయి. ప్రాణం పోయినా, పీక కోసినా జగన్ అరాచక పాలనకు దాసోహం అనడానికి నిరాకరించి, జగన్ అధ్వానపాలనను వ్యతిరేకించి, ధిక్కరించి ఎన్నో కుటుంబాలు నిలువనీడను కోల్పోయాయి. అయినా అదరక బెదరక జగన్ పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. జగన్ పోవాలి అని నినదించాయి. రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన రావాలని, అలా రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని తలచి ఆయన వెంట నడిచాయి. తెలుగుదేశం జెండా ఎత్తాయి.
అలా జగన్ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొని, నానా బాధలూ పడిన బాధిత కుటుంబాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానాలు వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా 104 జగన్ బాధిత కుటుంబాలకు తెలుగుదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కుటుంబాలలో జై జగన్ అనడానికి నిరాకరించి జై చంద్రబాబు అని నినదిస్తూ వైసీపీ మూకల దాష్టీకారిని బలైన మాచర్లకు చెందిన చంద్రయ్య కుటుంబానికీ, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికీ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది. వీరందరి కోసం ప్రమాణ స్వీకార వేదిక సమీపంలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావడానికి కష్టాల్, నష్టాల్ ఎదురైనా వెరవకుండా ధైర్యంగా నిలబడి సత్యాగ్రహాన్నిప్రదర్శించిన వారిని గుర్తించి, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం ద్వారా ఆ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్న సందేశాన్ని ఇవ్వడం ముదావహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.