posted on Jun 8, 2024 11:38AM
రామోజీరావు మరణం పట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాప సందేశంలో మీడియా రంగం ఒక టైటాన్ ను కోల్పోయిందని పేర్కొన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన సంతాప సందేశంలో రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం.ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషి ద్వారా, ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు.
రామోజీ రావు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారు. ఆయనతో సంభాషించడానికి, ఆయన అపారమైన జ్ఞానాన్నుంచి లబ్ధి పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు రామోజీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖులు చిరంజీవి, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు అశ్రునివాళులర్పించారు. అలాగే రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ షూటింగ్ ను నిలిపివేసి రామోజీ మృతి పట్ల సంతాపం తెలిపింది.