TDP Union Cabinet Berths : లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నాయి. రేపు(ఆదివారం) ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని దిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలకు కేంద్ర కేబినెట్ లో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీకి నాలుగు, జేడీయూకు రెండు కేబినెట్ మంత్రులు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు కేంద్ర మంత్రుల పదవులకు ఖరారైనట్లు తెలుస్తోంది. రామ్మోహన్‌నాయుడికి కేబినెట్ హోదా, పెమ్మసానికి కేంద్ర సహాయమంత్రి పదవి ఖరారు చేసినట్లు దిల్లీ వర్గాలు చెబుతున్నాయి.