posted on Jun 8, 2024 4:18PM
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు అంటే జూన్ 9న ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్ల జరుగు తున్నాయి.
ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. మూడోసారి దేశ ప్రధానిగా మోడీ రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7. 15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఇక, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సార్క్ సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీజినల్ కో-ఆపరేషన్ దేశాల అతిథులను ఆహ్వానించారు. అలాగే, ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథులు హోటల్‌కు వెళ్లే మార్గం పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇదే కాకుండా పొరుగు దేశాలైన భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాల నేతలు మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.
ప్రత్యేక అతిధులు
మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి స్పెషల్ గెస్టులు రానున్నారు. నూతన పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు, ట్రాన్సజెండర్‌లు, పారిశుద్ధ్య కార్మికులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అలాగే భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు. కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాల్లో చాలా మార్పులు చోటుచేసుకొన్నాయి. బలమైన దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరి సహకారాన్ని ప్రధాని మోదీ మరువరని కూటమి నేతలు అంటున్నారు. వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే ఆహ్వానాలు పంపే రోజులు పోయాయని వారు అన్నారు. మా పీఎం అట్టడుగు వర్గాల్లో వారిని కూడా వీఐపీలుగానే చూస్తారు అని కూటమి వర్గాలు తెలిపాయి.