
- సాయిపూర్ ‘సీనియర్ల’ సైలెంట్ వార్
- మున్సిపల్ కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది?
- రాజకీయ అనుభవానికి అగ్నిపరీక్ష
- ఈ సీనియర్ నాయకుల రాజకీయం హాట్ హాట్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే సాయిపూర్ రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన సీనియర్ నేతలకు ఈసారి ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ముఖ్యంగా 9, 10, 11 వార్డుల సిట్టింగ్ కౌన్సిలర్లు ఈసారి ‘వార్డు’ మారుతారా? లేక అదే స్థానం నుంచి పోరాడతారా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
వార్డు మార్పు యోచనలో నీరజ బాల్రెడ్డి?
11వ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్‌గా ఉన్న బాల్రెడ్డి నీరజ ఈసారి తన రూటు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె 12వ వార్డుపై దృష్టి సారించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 11వ వార్డులో గెలుపు కష్టమనే సంకేతాలు రావడంతోనే ఆమె సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అయితే, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిలో ఉన్న వీరికి, మళ్ళీ చైర్మన్ పీఠం దక్కుతుందా? లేక వేరే నేతలకు అవకాశం ఇస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది.
చైర్మన్ పీఠంపై నర్సింలు-దీపా దంపతుల కన్ను!
9వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింలు – దీపా దంపతులు ఈసారి ఏకంగా మున్సిపల్ చైర్మన్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ తరపున చైర్మన్ అభ్యర్థిగా తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, వారు 9వ వార్డులోనే ఉంటారా లేక పట్టున్న మరో వార్డును ఎంచుకుంటారా అనేది సాయిపూర్ రాజకీయాల్లో మిస్టరీగా మారింది.
అదే వార్డు.. అదే జోరు.. పెట్లోళ్ల నర్సిములు పంతం!
10వ వార్డులో తన పట్టును నిరూపించుకోవాలని పెట్లోళ్ల నర్సిములు – రత్నమాల దంపతులు సిద్ధమవుతున్నారు. గతంలో వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వీరు, ప్రస్తుతం అధికారిక పదవుల్లో లేకపోవడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చైర్మన్ స్థానం ఆశిస్తున్న నాయకుల జాబితాలో వీరు కూడా ముందు వరుసలో ఉన్నారు.
యువ నేతల దూకుడు.. సీనియర్ల బేజారు!
ఎన్నికల బరిలో ఈసారి యువ రక్తం ఉరకలేస్తోంది. వార్డుల్లో ఎదురవుతున్న కొంత వ్యతిరేకత, యువ నాయకుల పోటీ ఈ ముగ్గురు సీనియర్లకు తలనొప్పిగా మారింది. కేవలం అనుభవం ఉంటే సరిపోదని, ప్రజాదరణ కూడా ముఖ్యమని ఓటర్లు భావిస్తుండటంతో, గెలిచి బయటపడటం ఈ దిగ్గజాలకు సవాల్‌గా మారింది.
మహిళా ఓటర్లదే నిర్ణయాత్మక శక్తి?
తాండూరు మున్సిపల్ పరిధిలో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో, చైర్మన్ పీఠాన్ని మహిళకే కేటాయించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే నీరజ, దీపా, రత్నమాల మధ్య త్రిముఖ పోటీ తప్పదనిపిస్తోంది.
సాయిపూర్ సీనియర్లు ఇప్పటికే వార్డు మీటింగ్లు, ప్రజా కార్యక్రమాలతో ప్రచార జోరు పెంచారు. ఎవరి ఎత్తుగడలు ఎలా ఉన్నా, ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. తమ రాజకీయ అనుభవం ఈ ముగ్గురిని గట్టెక్కిస్తుందా? లేక యువ కెరటాల ధాటికి తలవంచుతారా? అనేది తాండూరు టాక్ ఆఫ్ ది టౌన్!



