Wednesday, October 30, 2024

Porsche accident : ‘వ్యాసాలు రాయి..’ పోర్షేతో ఇద్దరిని చంపిన మైనర్​కి 15 గంటల్లోనే బెయిల్​!

Pune Porsche accident accused : మహారాష్ట్ర పూణెలో అతివేగంతో పోర్షే కారును నడిపి, ఇద్దరి మరణానికి కారణమైన 17ఏళ్ల మైనర్​కి.. అరెస్ట్​ అయిన 15 గంటల్లోనే బెయిల్​ లభించింది! అంతేకాదు.. రోడ్డు ప్రమాదాలపై వ్యాసాలు రాయాలంటూ బెయిల్​ ఇవ్వడం గమనార్హం.

పోర్షే నడిపి ఇద్దరిని చంపి..

మహారాష్ట్ర పూణెలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. 200 కేఎంపీహెచ్​తో పోర్షేని నడిపిన ఆ బాలుడు.. పూణెలోని ఓ ప్రముఖ రియాల్టర్​ కుమారుడు. నెంబర్​ ప్లేట్​ కూడా లేని ఆ కారు.. బైక్​ని ఢీకొట్టింది. ఈ ఘటనలో.. 24ఏళ్ల అనీశ్​ అవాధియా, అశ్విణీ కోష్ట అనే ఇంజినీర్లు మరణించారు. మధ్యప్రదేశ్​వాసులైన ఈ ఇద్దరు.. ఉద్యోగం రిత్యా పూణెకు వెళ్లారు. పోర్షే ఢీకొట్టిన తర్వాత.. అశ్విణీ గాల్లోకి ఏకంగా 20 అడుగుల ఎత్తులోకి ఎగిరి పడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనీశ్​ వెళ్లి పార్క్​ చేసి ఉన్న కారు మీద పడ్డాడు. తీవ్రగాయాలతో ఆ ఇద్దరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు.

“రాత్రి 2:15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కారు చాలా వేగం మీద ఉంది. బైక్​ని ఢీకొట్టిన వెంటనే.. కారు డ్రైవర్​ మరింత స్పీడ్​ పెంచి, అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎయిర్​బ్యాగ్స్​ బయటకు రావడంతో ముందు కనిపించక.. కారును పక్కకు ఆపాడు. చివరికి స్థానికుల చేతికి చిక్కాడు. డ్రైవర్​తో పాటు మరో ఇద్దరు కారులో ఉన్నారు. వారిలో ఒకరు పారిపోయారు. స్థానికులు.. ఆ ఇద్దరిని కొట్టి, పోలీసులకు అప్పగించారు,” అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

Pune Porsche accident : పోర్షే నడిపిన మైనర్​ని పోలీసులు అరెస్ట్​ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అతను.. 12వ తరగి పరీక్షల్లో పాస్​ అవ్వడంతో పబ్​కి వెళ్లి ఫ్రెండ్స్​తో పార్టీ చేసుకున్నాడని.. మద్యం మత్తులో బండి నడిపాడని తేలింది. అతనిపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. మైనర్​కి మద్యం పోసిన పబ్​కి, మైనర్​కి కారు ఇచ్చిన తండ్రికి కూడా నోటీసులు ఇవ్వాలని పోలీసులు చూస్తున్నారు.

ఈ వ్యవహారం సెషన్స్​ కోర్టుకు వెళ్లింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన మైనర్​ని.. మేజర్​గా పరిగణించాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కస్టడీకి ఇవ్వాలని అడిగారు. బెయిల్​ పిటిషన్​ని రద్దు చేయాలని వాదించారు. కానీ.. సెషన్స్​ కోర్టు ఆ బాలుడికి బెయిల్​ మంజూరు చేసింది.

15 రోజుల పాటు యేరవాడా ట్రాఫిక్​ పోలీసులతో సెషన్స్​ తీసుకోవాలని, యాక్సిడెంట్స్​పై వ్యాసాలు రాయాలని, డ్రింకింగ్​ హ్యాబిట్​ నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకోవాలని, కౌన్సిలింగ్​ సెషన్స్​కి వెళ్లాలని చెబుతూ.. బెయిల్​ ఇచ్చింది కోర్టు.

Pune Porsche accident victims : మరోవైపు.. ఈ కేసును అసిస్టెంట్​ కమీషనర్​ ఆఫ్​ పోలీస్​ స్థాయి అధికారి దర్యాప్తు చేపట్టిన తెలుస్తోంది. కేసును బలంగా నిర్మించి, నిందితుడిని శిక్షించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

మరోవైపు ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మద్యం తాగి పోర్షే నడపి, ఇద్దరిని చంపడం నేపథ్యంలో దేశంలో చట్టాలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చట్టంపై ఎవరికి భయం ఉండటం లేదని, సమాజంలో క్రమశిక్షణ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana