KKR vs PBKS IPL 2024 : ఐపీఎల్ 2024లో నెక్ట్స్ ఏంటి? 300 కొట్టేస్తారా? 350 కూడా వెళుతుందా? బ్యాటర్లు 200 కొట్టడం ఖాయమేనా? 25 బాల్స్‌లో సెంచరీలను చూస్తామా? ఒకప్పుడు.. ఊహకు అందని ఈ స్కోర్లు.. ఈ ఐపీఎల్ సీజన్లో బ్యాటర్ల విధ్వంసం చూస్తుంటే.. అసాధ్యం అనిపించడం లేదు! ఇక శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ 261 రన్స్ కొట్టడం ఒకెత్తైతే.. ఆ టార్గెట్‌ని 8 బాల్స్ మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ ఛేజ్ చేసి పడేయడం మరో ఎత్తు! ఇలా రికార్డు స్థాయి స్కోర్లు నమోదవుతుండటం.. ఫ్యాన్స్‌కి వినోదాన్ని అందిస్తున్నా, చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అంటేనే బ్యాట్‌కి బాల్కి మధ్య పోటీ అని.. కానీ ఇప్పుడు బౌలర్లు అల్లాడిపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత.. ‘వరస్ట్ ఐపీఎల్’ ట్విట్టర్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. బౌలర్లను కాపాడండి అంటూ.. స్పిన్నర్ అశ్విన్ పోస్ట్ చేశాడు.
ఐపీఎల్ 2024లో బాదుడే బాదుడు..!
ఒకప్పుడు 180 స్కోరంటేనే చాలా ఎక్కువ అనిపించేది. టీమ్స్ ప్రశాంతంగా ఉండేవి. కానీ ఇప్పుడు.. 200 టార్గెట్ కూడా సరిపోవడం లేదు. 200 దాటినా.. టీమ్స్‌లో ఆందోళన! ఐపీఎల్ 2024 స్టాట్స్ చూస్తుంటే.. ఇది స్పష్టంగా తెలుస్తోంది. గత 12 ఐపీఎల్ మ్యాచుల్లో.. 12సార్లు 200 రన్స్ స్కోర్ నమోదైంది. ఈ సీజన్లో 250 స్కోర్ ఏకంగా 7సార్లు దాటింది.
దీనిపై స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు.
IPL 2024 records : “ఎవరైనా దయచేసి బౌలర్లను కాపాడండి. అర్జెంట్, ఎస్ఓఎస్. టీ20 గేమ్, 260+ స్కోర్ ఛేజింగ్‌లో చివరి 2 ఓవర్లలో బాల్కి రన్ వచ్చింది,” అని పోస్ట్ చేశాడు అశ్విన్.
అశ్విన్ ఒక్కడే కాదు.. చాలా మంది బౌలర్ల ఇదే అభిప్రాయపడుతున్నారు. ఆర్సీబీ పేసర్ మహమ్మద్ సిరాజ్ సైతం.. కొన్ని రోజుల క్రితం ఇదే విధంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చెప్పింది ఇదే! బ్యాట్‌కి బాల్కి మధ్య పోటీ లేకపోతే.. ఏదో ఒక రోజు క్రికెట్ క్రేజ్ పడిపోతుందని ఆయన అన్నాడు.
ఫ్లాట్ వికెట్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. బౌలర్స్‌ని చాలా ప్రభావితం చేస్తోంది. ఇదే విషయంపై ట్విట్టర్లో వరస్ట్ ఐపీఎల్ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
“ఇది వరస్ట్ ఐపీఎల్. బాల్కి బ్యాట్‌కి మధ్య బ్యాలెన్స్ లేదు. ఇండియాకు మంచి బౌలర్లు రాకపోయినా బీసీసీఐ బాధపడదు. బ్యాటింగ్ ప్యారడైజ్‌లో బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫ్లాట్ ట్రాక్స్‌పై విరుచుకుపడేవారికి మంచి పిచ్ ఇస్తే.. అప్పుడు తెలుస్తుంది,” అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
“గత 12 రోజుల్లో 12సార్లు 200 ప్లస్ స్కోర్ దాటింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే వరస్ట్ ఐపీఎల్ అవుతుందా?” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Worst IPL 2024 : “టీ20ల్లో 40 సిక్సులా? వరస్ట్, వరస్ట్ ఐపీఎల్” అని ఇంకొకరు పేర్కొన్నారు.
“ఐపీఎల్‌కి పాకిస్థాన్ సూపర్ లీగ్‌కి మధ్య తేడా లేకుండా పోయింది. వరస్ట్ ఐపీఎల్ సీజన్,” అని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు.