posted on Apr 26, 2024 3:05PM
మొన్నటి వరకు నేషనల్ ఛానల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ పరిస్థితి ఏమిటో తమతమ సర్వేల ద్వారా తెలిపాయి. ఏ ఛానెల్ లేదా సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే అయినా ఒకే రిపోర్టు ఇచ్చింది.. ఈసారి ఎన్నికలలో ఏపీలో వైసీపీ ఓడిపోతుంది.. టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకు చాలా సర్వేలు విడుదలయ్యాయి. అన్ని సర్వేల ఫలితం ఒకటే.. వైసీపీ ఖేల్ ఖతమ్ అనే. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతోపాటు పార్లమెంట్ స్థానాలను కూడా ఆ పార్టీ భారీగా కోల్పోబోతోందని సర్వేలు తేల్చాయి. ఈ సర్వేలన్నీ దాదాపుగా కోడికత్తి-2 సంఘటనకు ముందు చేసినవే.. ఈ సంఘలనకు ముందు వైసీపీకి 30 వరకు సీట్లు వచ్చే అవకాశం వుందని ఓవరాల్‌గా చెప్పాయి. అయితే ఈ సంఘటన తర్వాత జనం ఆలోచనలో ఇంకా బాగా మార్పు వచ్చిందని, ఈ నాటకాన్ని వారు అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ముందుగా అనుకున్న సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి సర్వేలకు కామా పడింది. పోలింగ్ పూర్తయిన తర్వాత సర్వేల పరంపర ఎలాగూ కొనసాగుతుంది. మరి ఈ మధ్యకాలంలో సర్వేలు లేకపోతే ఎలా? ఏం పర్లేదు.. సర్వేలు లేకపోయినా వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే చాలు.. ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో అర్థమైపోతుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాటని పెద్దలు ఊరకే అనలేదు.
ముందుగా త్వరలో మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ముఖం చూడండి.. ఆయన ముఖంలో భూతద్దం పెట్టి వెతికినా ఏ మూలనా కళ అనేది కనిపించడంలేదు. కూటమి ధాటికి ‘ఓటమి’ అనేది ఆయన ముఖంలో క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఇక ఇతర వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే, అందరి ముఖాల్లో ఓటమి కళ సెవెన్టీ ఎంఎంలో కనిపిస్తూ వుంటుంది. పాపం అదేంటో, వైసీపీ నాయకులు నోటితో గెలుస్తాం అని చెబుతూ వుంటే, ముఖాలు మాత్రం ఓడిపోతాం అని చెప్పకనే చెబుతున్నాయి.