KKR vs PBKS: పంజాబ్ కింగ్స్ ఊచకోత కోసింది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన చేసి చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 262 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసింది. 18.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. బెయిర్‌స్టో సెంచరీ, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ మెరుపు హాఫ్ సెంచరీలు పంజాబ్ కింగ్స్ చరిత్రను తిరగరాసేలా చేశాయి.
రికార్డ్ బ్రేకర్స్.. హిస్టరీ మేకర్స్..
పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో అన్ని టీ20 రికార్డులు బ్రేక్ చేసింది. గతంలో 259 పరుగులతో సౌతాఫ్రికా పేరిట ఉన్న అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డును పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది. 262 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేయడం అంటే మాటలు కాదు. బెయిర్‌స్టో కేవలం 48 బంతుల్లో 9 సిక్స్‌లు, 8 ఫోర్లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
శశాంక్ సింగ్ కేవలం 28 బంతుల్లోనే 8 సిక్స్ లు, 2 ఫోర్లతో 68 రన్స్ చేశాడు. ఇక ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ కూడా 20 బంతుల్లో 54 రన్స్ చేశాడు. మొత్తంగా పంజాబ్ ఇన్నింగ్స్ లో 24 సిక్స్ లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్ లు నమోదైన మ్యాచ్ కూడా ఇదే. కేకేఆర్ 18 సిక్స్ లు బాదగా.. పంజాబ్ కింగ్స్ 24 కలిపి మొత్తంగా 42 సిక్స్ లు బాదారు.
ఒక ఇన్నింగ్స్ లో 24 సిక్స్ లు కూడా సరికొత్త రికార్డే. ఇలా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ పంజాబ్ కింగ్స్ చరిత్రను తిరగరాసింది. నిజానికి చేజింగ్ లో పంజాబ్ కింగ్స్ కు మెరుపు ఆరంభాన్నిచ్చారు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, జానీ బెయిర్‌స్టో. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఆరు ఓవర్లలోనే 93 రన్స్ జోడించారు. ప్రభ్‌సిమ్రన్ కేవలం 20 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు పెవిలియన్ చేరిన తర్వాత బెయిర్‌స్టో విధ్వంసం మొదలైంది.
చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్.. నైట్ రైడర్స్ కు రికార్డు స్కోరు అందించారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ చుక్కలు చూపించారు. ఈ సీజన్లో టాప్ ఫామ్ లో ఉన్న నరైన్ తోపాటు సాల్ట్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇద్దరికీ మొదట్లోనే పంజాబ్ కింగ్స్ ఫీల్డర్లు లైఫ్ ఇచ్చారు. నరైన్ 16 పరుగుల దగ్గర, సాల్ట్ 34 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తొలి వికెట్ కు 10.2 ఓవర్లలోనే 138 పరుగులు జోడించారు. సాల్ట్ 37 బంతుల్లోనే 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 75 రన్స్ చేశాడు. మరోవైపు నరైన్ 32 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్ లతో 71 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో నరైన్ ఆరెంజ్ క్యాప్ రేసులో 357 పరుగులతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. వీళ్లు అందించిన మెరుపు ఆరంభాన్ని చివర్లో వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ జోడీ కొనసాగించడంతో నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లోనే 28 రన్స్ చేశాడు. అతడు ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6 బాదడం విశేషం. ఇక వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లోనే 39 రన్స్ చేశాడు. మధ్యలో రసెల్ 12 బంతుల్లోనే 24 రన్స్ చేసి తన వంతు స్కోరు జత చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో నైట్ రైడర్స్ బ్యాటర్లు ఏకంగా 18 సిక్స్ లు బాదారు. అలాగే 22 ఫోర్లు కూడా ఉన్నాయి. అంటే మొత్తం బౌండరీల రూపంలోనే 196 పరుగులు రావడం విశేషం.