Mango Lassi: వేసవిలో మాత్రమే దొరికేది మామిడి పండు. దీనితో అనేక రకాల రెసిపీలను ట్రై చేయవచ్చు. ఇక్కడ మేము స్వీట్ మ్యాంగో లస్సీ రెసిపీ ఇచ్చాము. చల్ల చల్లని ఈ మ్యాంగో లస్సీని తాగితే ఎంత వేడి అయినా కూడా చల్లగా అనిపించడం ఖాయం. రుచిలో ఇది అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. మామిడి పండులో ఎలాగూ తీపి ఉంటుంది. కాబట్టి చక్కెరను తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది ఆరోగ్యకరమని చెప్పుకోవచ్చు. ఇక మ్యాంగో లస్సీ ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.
మ్యాంగో లస్సీ రెసిపీకి కావలసిన పదార్థాలు
మామిడిపండ్లు – రెండు
పెరుగు – ఒక కప్పు
కాచి చల్లార్చిన పాలు – అర కప్పు
యాలకుల పొడి – చిటికెడు
పిస్తా తరుగు – ఒక స్పూను
చక్కెర – ఒక స్పూను
మ్యాంగో లస్సి రెసిపీ
1. బాగా పండిన మామిడి పండును లస్సీ కోసం ఎంచుకోవాలి.
2. తొక్కను తీసి గుజ్జునంతా ఒక గిన్నెలో వేసుకోవాలి.
3. దాన్ని స్పూన్ తోనే బాగా కలపాలి.
4. లేదంటే బ్లెండర్లో వేసి ఒకసారి మెత్తని పేస్ట్ లా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. ఇప్పుడు అదే గిన్నెలో పాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా వేసి బాగా కలపాలి.
7. ఒక స్పూన్ చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపండి.
8. కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి బయటకు తీయండి.
9. పైన పిస్తా తరుగును చల్లండి. ఒక గ్లాసులో వేసుకొని తాగితే మ్యాంగో లస్సి అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.
ఎండన పడి వచ్చిన వాళ్లకు ఈ మ్యాంగో లస్సి ఇచ్చి చూడండి. ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. శక్తి కూడా అందుతుంది. ఇందులో చక్కెరను వేయకపోయినా ఫరవాలేదు… ఎందుకంటే మామిడిపండులోని తీపిదనం సరిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ మ్యాంగో లస్సీని చక్కెర వేసుకోకుండా కొద్దిగా తాగితే ఎలాంటి సమస్య ఉండదు. దీనిలో మనం పాలు, పెరుగు, యాలకులపొడి వంటి ఆరోగ్యకరమైన పదార్థాలనే వాడాము. కాబట్టి పిల్లలు తాగిన ఎలాంటి సమస్య రాదు. చక్కెరను ఎంత తగ్గించుకుంటే అంతటి ఆరోగ్యం. పంచదారను పూర్తిగా మానేసిన ఎలాంటి సమస్య ఉండదు. తీపిదనం తగ్గింది అనిపిస్తేనే కాస్త చక్కెరను జత చేయండి.