Wednesday, January 22, 2025

Virat Kohli Out Controversy: విరాట్ కోహ్లి ఔట్ వివాదంపై స్పందించిన స్టార్ స్పోర్ట్స్.. క్రికెట్ రూల్స్ చూడండి అంటూ..

Virat Kohli Out Controversy: కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఔటైన విధానం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నడుము కంటే పైకి వచ్చిన ఫుల్ టాస్ బంతికి అతడు ఔటయ్యాడు. 

అది నోబాల్ అని కాన్ఫిడెంట్ గా ఉన్న విరాట్ కోహ్లికి షాకిస్తూ.. మూడో అంపైర్ అతన్ని ఔట్ గా డిక్లేర్ చేశాడు. ఇది వివాదానికి కారణం కావడంతో బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ దీనిపై స్పందించింది.

కోహ్లి ఔట్‌పై స్టార్ స్పోర్ట్స్ వాదన ఇదీ

కేకేఆర్ పై తనను ఔట్ గా ప్రకటించడంపై కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాదించాడు. బౌండరీ బయట ఉన్న చెత్త కుండీని కోపంతో కింద పడేస్తూ పెవిలియన్ కు వెళ్లాడు. దీనిపై సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారం రేగింది. అయితే స్టార్ స్పోర్ట్స్ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించింది. క్రికెట్ రూల్ బుక్ ప్రకారం.. కోహ్లి ఎలా ఔటో వివరిస్తూ ట్వీట్ చేసింది.

ఈ సందర్భంగా హాక్ ఐ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. ఆ సమయంలో కోహ్లి క్రీజు బయట ఉండటం కూడా అతని కొంప ముంచింది. క్రీజు లైన్ దగ్గర నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే నోబాల్ ఇస్తారు. కానీ కోహ్లి విషయంలో అలా జరగలేదు. అతడు బయట ఉండటంతో ఆ సమయంలో నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న బంతి తర్వాత కిందికి వెళ్లినట్లు హాక్ ఐ తేల్చింది.

“విరాట్ అధికారిక రూల్ బుక్ ప్రకారం ఔటే. స్టెప్పింగ్ క్రీజును దాటే సమయంలోనూ బంతి నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంటేనే నోబాల్ గా పరిగణిస్తారు. కోహ్లి విషయంలో అతడు బంతిని ఎదుర్కొన్న సమయంలో నడుము ఎత్తులో ఉంది. అయితే స్టెప్పింగ్ క్రీజు దాటే సమయంలో మాత్రం అంతకంటే కింద ఉంది. దీంతో నిబంధనల ప్రకారం అది సరైన బాలే” అని వివరణ ఇచ్చింది.

మూడో అంపైర్ ఏమన్నాడంటే..

కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా వేసిన ఫుల్ టాస్ ను కోహ్లి డిఫెండ్ చేయబోగా అది గాల్లోకి లేచింది. రానా దానిని అందుకున్నాడు. అంపైర్ ఔటివ్వగా.. కోహ్లి వెంటనే రివ్యూ కోరాడు. దీనిపై మూడో అంపైర్ మైఖేల్ గాఫ్ రీప్లేలు చూసి స్పందిస్తూ.. హైట్ విషయంలోనూ బంతి ఫెయిర్ డెలివరీయే అని స్పష్టం చేశాడు. అది చూసి కోహ్లి తీవ్ర అసహనానికి గురయ్యాడు.

పెవిలియన్ కు వెళ్తూ మధ్యలో అంపైర్లతో గొడవ పడ్డాడు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెస్సి కూడా అంపైర్లతో ఇదే విషయంలో వాదించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లి 7 బంతుల్లోనే 18 పరుగులతో ఊపు మీద కనిపించాడు. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఒకే ఒక్క పరుగుతో ఓడిపోయింది. చివరి ఓవర్లో కర్ణ్ శర్మ మూడు సిక్సర్లు బాది విజయానికి చేరువ చేసినా.. ఐదో బంతికి అతడు ఔటవడంతో కేకేఆర్ పరుగు తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana