posted on Apr 21, 2024 11:10AM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ గ్రాఫ్ తగ్గిపోతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలలో వైసీపీ అభ్యర్థులు విజయం కష్టంగా మారింది. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుతో పాటు, వైసీపీ అధినేత, సీఎం జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో జగన్ బస్సు యాత్రకు సైతం ప్రజాదరణ కరువైంది. బస్సు యాత్రకు ప్రజలను తరలించేందుకు స్థానిక వైసీపీ నేతలు నానా తంటాలు పడుతున్న పరిస్థితి. ఇటీవల బస్సు యాత్ర సమయంలో జగన్పై రాయి దాడి ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, గత ఎన్నికల అనుభవంతో ప్రజలు వైసీపీ కుట్రలను తిప్పికొట్టారు. దీంతో స్థానిక తెలుగుదేశం నేతలపై ఈ రాయి దాడి ఘటనను నెట్టేందుకు పోలీసుల సహకారంతో వైసీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకపక్క ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతోపాటు, సానుభూతి కోసం వైసీపీ అధిష్టానం వేసిన ప్లాన్ సైతం బెడిసి కొట్టడంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతున్నదని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో.. అమ్మఒడి ఇచ్చాం.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేశాం.. ప్రతీనెలా ఇంటింటికి పెన్షన్ డబ్బులు అందిస్తున్నాం అంటూ గొప్పగా చెబుతున్నారు. అభివృద్ధి అంటే రోడ్లు బాగుచేయడం, పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం.. రాజధాని నిర్మాణం ఇవేమీ కాదు.. కేవలం బటన్ నొక్కడం ఇంటింటికి డబ్బులు ఇవ్వడమే అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. ఎన్నికల ప్రచారంలోనూ నేను బటన్ నొక్కాను.. ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలి అన్నట్లుగా జగన్ ప్రసంగిస్తున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు, డబ్బులు ఇవ్వడం వెనుక బండారాన్ని ఎన్నికల ప్రచార సభల్లోతెలుగుదేశం నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. పది రూపాయిలు ఇచ్చి వెయ్యి రూపాయలను ప్రజల నుంచి జగన్ ఎలా లాక్కుంటున్నారో కూటమి నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. దీనికితోడు జగన్ బటన్ నొక్కుడు వెనుక అసలు బండారాన్ని బయటపెడుతూ తెలుగుదేశం దివాకరం అనే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించింది. ఈ వీడియోలో జగన్ ప్రజల నుంచి ఎంత దోచుకుంటున్నారో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ దివాకరం షార్ట్ ఫిల్మ్ చర్చనీయాంశంగా మారింది.
అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో, పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన దివాకరం షార్ట్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ది క్యాషియర్ అనే ట్యాగ్ లైన్ తో ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో వివిధ వర్గా ప్రజలలో ఆలోచన రేకెత్తిస్తోంది. మద్యం తాగే ఒక్కో వ్యక్తి నుంచి అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఎంత దోచిందో.. మందు బాబు నోటితోనే చెప్పించారు. ఐదేళ్లలో మద్యం సేవించే ఒక్కో వ్యక్తి నుంచి రూ. 2.16లక్షలు దోచుకున్నారు.. నవరత్నాల పేరుతో కుటుంబానికి జగన్ ఇస్తుంది ఏడాది రూ. లక్ష.. కానీ పెట్రోల్, డీజిల్, ఇసుక ధరలు, బస్, విద్యుత్, ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్త పన్ను, రోడ్ ట్యాక్స్, పైబర్ నెట్ ఛార్జీలు పెంచి జగన్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి దోచుకుంటున్నది పెంచినవన్నీ లెక్కేస్తే ఐదేళ్లలో ఒక్కో కుటుంబం నుంచి జగన్ సర్కార్ దోచింది అక్షరాలా రూ. 10లక్షలు అంటూ వీడియోలో లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు.
ఐదేళ్లలో జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన దివాకరం షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వైసీపీ అభ్యర్థులు ఈ వీడియోను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు నష్టపోయిన విధానాన్ని కుప్తంగా వీడియోలో వివరించడంతో ప్రజల్లో పార్టీపై మరింత వ్యతిరేకత పెరిగి తమ ఓటమికి కారణమవుతుందని వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రచారానికి వెళ్తున్న పలువురు వైసీపీ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ విడుదల చేసిన దివాకరం షార్ట్ ఫిల్మ్ ప్రజలలో వ్యతిరేకత మరింత పెంచిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.