posted on Apr 12, 2024 4:42PM
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరిగిపోతున్నది. విజయావకాశాలపై నమ్మకం కోల్పోవడంతో దింపుడు కళ్లెం ఆశగా ఆ పార్టీ మరోసారి అభ్యర్థుల మార్పుపై దృష్టి సారించింది. వైసీపీ గెలుపు అవకాశాలు రోజురోజుకూ దిగజారిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా వెలువడుతున్న సర్వేలలో కూడా ఆ పరిస్థితి కనిపిస్తున్నది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని తాజాగా జన్మత్ సర్వే పేర్కొంది. దీంతో విజయంపై ఇంత కాలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్న వైసీపీ ఇప్పుడు పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చి అయినా సరే వ్యతిరేకతను తగ్గించుకోవాలన్న భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది.
ప్రధానంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని మార్చాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీలో ఉండటంతో వైసీపీకి భారీ నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో అవినాష్ పోటీలో ఉంటే వైసీపీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమన్న విశ్లేషణల నేపథ్యంలో ఆయనను మార్చేసే విషయాన్ని జగన్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా జగన్ పోటీ చేసే పులివెందుల నియోజకవర్గం కడప లోక్ సభ పరిధిలో ఉండటంతో అవినాష్ కడప నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం పులివెందులపై కూడా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆందోళనతో జగన్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో అభిషేక్ రెడ్డిని నిలిపే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు నేడో రేపో అధికారికంగా ప్రకటించే ఛాన్సస్ ఉన్నాయని చెబుతున్నారు.
అదే విధంగా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో అభ్యర్థుల మార్పుపై కూడా వైసీపీ హైకమాండ్ అంటే జగన్ ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. మైలవరంలో సర్నాల తిరుపతిరావు స్థానంలో ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్‌కు గట్టి పోటీ అయినా ఇవ్వాలంటే ఈ మార్పు తప్పదని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి షేక్ ఆసిఫ్ స్థానంలో ఇటీవలే జనసేన నుండి వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన పోతిన మహేష్‌ను భర్తీ చేసే అవకాశాలున్నాయంటున్నారు.
ఇక గుంటూరు పశ్చిమ అభ్యర్థి కిలారి రోశయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపి, ఆ స్థానానికి మరో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తం మీద పలు నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పుపై వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరో వైపు తెలుగుదేశం కూటమిలో సీట్ల సర్దుబాటు సజావుగా పూర్తి అయ్యి, ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. అధికార వైసీపీలో కీలక నియోజకవర్గాలలో ఇంకా అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి రాలేక మల్లగుల్లాలు పడుతుండటం, ప్రకటించిన అభ్యర్థుల స్థానంలో మరొకరిని పోటీకి దించే అవకాశాలపై పార్టీలోనే చర్చ జరుగుతుండటంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. దీంతో ఆ పార్టీ ప్రచారం నత్తనడకన సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.