posted on Apr 12, 2024 4:20PM
‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ అనే సామెత అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సామెత బీఆర్ఎస్ దెయ్యాలకు… సారీ బిఆర్ఎస్ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఈమధ్యకాలంలో చాలామంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కారాలూ మిరియాలు నూరుతున్నారు.
ఇలా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం నీతి బాహ్యమైన చర్య అని ఆక్రోశిస్తున్నారు. ఇలా పార్టీలు మారడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అని, ప్రజాస్వామ్యానికే గొడ్డలివేటు అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ ప్రెస్ మీట్లు ఎవరైనా అమాయకులు చూశారంటే అయ్యోపాపం అని జాలిపడతారు. కాంగ్రెస్ పార్టీ దారుణం చేస్తోందని కోపగిస్తారు. అయితే ఇక్కడ వెరైటీ ఏమిటంటే, పార్టీ ఫిరాయింపుల విషయంలో నీతులు వల్లిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరెవరో కాదు.. గతంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీదో, టీడీపీ టిక్కెట్ మీదో గెలిచి ఎమ్మెల్యేలు అయి, ఆ తర్వాత అప్పటి టిఆర్‌ఎస్‌లో
చేరిపోయిన ప్రబుద్ధులే.
అప్పట్లో నిర్దాక్షిణ్యంగా పార్టీ మారిపోయిన ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇలా సంప్రదాయినీ, సుప్పినీ, సుద్దపూసనీ అన్నట్టుగా నీతులు చెబుతూ వుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఎర్రబెల్లి దయాకర్, కె.పి.వివేకానంద… ఇలా గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. రాజకీయాల్లో ఇంకా వెరైటీ ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా చేరిపోతారు. ఇలాంటి కప్పల తక్కెడ రాజకీయాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోవడం మానేసి చాలాకాలం అయింది.