posted on Apr 5, 2024 4:43PM
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలంబాట కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన కరవైంది. కరీంనగర్ జిల్లా ముగ్ధుంపూర్ లో ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు. భారీ కాన్వాయ్ తో ఆయన చేపట్టిన పొలంబాటకు రైతులు, ప్రజల నుంచి ఇసుమంతైనా స్పందన కానరాలేదు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన బయటకు వస్తే చాలు జనం పోటెత్తేవారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో స్వాగత ఏర్పాట్లు చేసే వారు. అయితే ఇప్పుడు అలాంటి హడావుడి ఏ మాత్రం కనిపించలేదు. తెలంగాణ సాధకుడు, ఉద్యమ నాయకుడు, దశాబ్దం పాటు సీఎంగా రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నేత వస్తున్నాడన్న ఆసక్తి కూడా ప్రజలలో కనిపించలేదు.
బీఆర్ఎస్ నేతల హంగామా తప్ప స్థానికులు, రైతులు కేసీఆర్ పొలంబాట కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఆయన పొలాల వద్దకు వెళ్లే సరికి అక్కడ రైతులు కూడా చాలా స్వల్ప సంఖ్యలోనే ఉండటంతో కేసీఆర్ కూడా ఎండిన పొలాల పరిశీలన కార్యక్రమాన్ని మమ అనిపించేశారు.