Friday, November 1, 2024

నరసాపురం బరిలో ఆర్ఆర్ఆర్? .. ఫ్రెండ్లీ కంటెస్ట్ కే బీజేపీ అభ్యర్థి పరిమితం? | rrr to contest fron narasapuram| alliance| parties| support| bjp| friendly

posted on Mar 30, 2024 4:58PM

ఎన్నికలు అనగానే అసమ్మతులు, అసంతృప్తులు సహజం. అదీ రెండు మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని కూటమిగా బరిలోకి దిగుతున్నప్పుడు సహజంగానే అసమ్మతి గళాల సంఖ్య ఒకింత ఎక్కువ ఉంటుంది. అయతే  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఒకింత సజావుగానే సాగిపోయింది. పొత్తులో భాగంగా బలాన్ని మించి స్థానాలు కోరిన బీజేపీని సంతృప్తి పరుస్తూనే.. బీజేపీ ఎవరిని అభ్యర్థులుగా నిలపకూడదో తెలుగుదేశం, జనసేనలు ముందుగానే ఆ పార్టీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్న బీజేపీ మిత్రపక్షాల డిమాండ్ ను మన్నించింది. ఆ మేరకు ఆ పార్టీ జీవీఎల్, సోము వీర్రాజు, మాధవ్ వంటి వారిని పోటీ నుంచి దూరంగా పెట్టింది.

దీంతో పెద్దగా అలకలూ, అసంతృులూ, అసమ్మతులూ లేకుండానే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగిపోయింది. సీట్ల సర్దుబాటు తరువాత సహజంగానే పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారిలో అసంతృప్తి ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఆ అసమ్మతి, అసంతృప్తి పార్టీల విజయావకాశాలను దెబ్బతీసేంత తీవ్రంగా లేకపోవడం పొత్తుకు జనం మద్దతు ఉండటమే కారణమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఒకటి రెండు స్థానాలలో మాత్రం బీజేపీ అభ్యర్థుల ఎంపిక పట్ల తెలుగుదేశం, జనసేనలలో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతోంది. దానికి బీజేపీ శ్రేణుల మద్దతు కూడా లభిస్తోంది. వాటిల్లో ముఖ్యంగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు పోటీలో ఉంటారని అంతా భావించారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ కోటాలోకి వెళ్లిన ఈ స్థానం నుంచి ఆ పార్టీ రఘురామకృష్ణం రాజును కాకుండా ప్రజలలో అంతగా గుర్తింపులేని బలహీన అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది.  దీంతో కూటమి పార్టీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

మొత్తంగా ఏపీలో తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలలో అభ్యర్థుల ప్రకటన పూర్తైపోయింది.  బీజేపీ  బీజేపీ  తమ పార్టీ  తరఫున ఎన్నికల బరిలో నిలిచే అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించేయగా, జనసేన మాత్రం రెండు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అక్కడక్కడా అలకలు తప్ప మొత్తంగా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు బైఆండ్ లార్జ్ సజావుగానే సాగిపోయింది. అయితే నరసాపురం లోక్ సభ నియోజకవర్గం మాత్రం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నరసాపురం సీటు విషయంలో  బీజేపీ ప్రకటించిన అభ్యర్థిపై అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.

ఇక్కడ రఘురామకృష్ణం రాజును కాదని ప్రజలకు పెద్దగా పరిచయం లేని భూపతి రాజు శ్రీనివాసవర్మ ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడంపట్ల సామాన్య జనంలో కూడా అసంతృప్తి వ్యక్తం  అవుతున్నది. సర్వత్రా రఘురామకృష్ణం రాజు పట్ల సానుభూతి వ్యక్తం అవుతున్నది. ఇక నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు కూడా రఘురామకృష్ణం రాజును లోక్ సభ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడం సరి కాదన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిన ప్రభావం నరసాపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నిటిపైనా  పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు రఘురామకృష్ణం రాజునే కూటమి అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానంలో నిలబెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విజ్ణప్తి చేయాలని తీర్మానించారు. ఇలా వారి రహస్య భేటీకి ముందు బీజేపీ అభ్యర్థి  భూపతి రాజు శ్రీనివాసవర్మ నిర్వహించిన ఒక ర్యాలీలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు పాల్గొనలేదు. ఆ ర్యాలీలో కొద్ది మంది బీజేపీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనడం స్థానికంగా గుర్తింపు ఉన్న కమలం నేతలు కూడా దూరంగానే ఉండటం గమనార్హం. ఆ ర్యాలీలో ఎక్కడా తెలుగుదేశం, జనసేన జెండాలు కనిపించకలేదు. దీంతో నరసాపురం ఎంపీ అభ్యర్థిని మార్చకుంటే కూటమి ఐక్యత ప్రశ్నార్ధకంగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే  ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల రహస్య భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే వీరి భేటీకి ముందే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా   అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాసవర్మ ను నిలబెట్లాలన్న నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా బీజేపీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తున్నది.  మొత్తం మీద కూటమిలోని ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు నరసాపురం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్నిమార్చుకోవాలని బలంగా కోరుతున్నాయి. విస్తృత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ కంటే బలంగా ఉన్న తాము కొన్ని త్యాగాలు చేశామనీ, మిత్ర ధర్మం ప్రకారం తాము ఒకింత తగ్గి బీజేపీ కోరిన మేరకు ఆ పార్టీకి టికెట్లు కేటాయించామనీ అయితే ఒక్క రఘురామకృష్ణం రాజు విషయంలో బీజేపీ ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో అర్ధం కావడం లేదనీ తెలుగుదేశం, జనసేనలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  నరసాపురం నియోజకవర్గం విషయంలో కూటమి శ్రేణుల ఐక్యత దెబ్బతినకుండా ఓట్ల బదలాయింపు సజావుగా సాగేందుకు మధ్యే మార్గంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తున్నది.  ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించేసినందున.. రఘురామకృష్ణం రాజు చేత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించి కూటమి ఆయనకు మద్దతుగా నిలవాలన్నదే ఆ ప్రతిపాదన. బీజేపీ అధికారిక అభ్యర్థి నామమాత్రంగానే రంగంలో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనది ఫ్రెండ్లీ కంటెస్ట్ గా ఉంటుందన్నమాట. అలా జరిగితే మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి అభ్యర్థిని మార్చిందన్న విమర్శ నుంచి బీజేపీ బయటపడుతుంది. అలాగే కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సజావుగా సాగేందుకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఈ ప్రతిపాదనపైనే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీరియస్ గా చర్చ జరుగిందని, ఈ ప్రతిపాదనకు బీజేపీ హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని తెలియవస్తోంది. మొత్తం మీద నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తారనీ, ఆయనకు కూటమి మద్దతు గట్టిగా ఉంటుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana