శనివారం ఉదయం ఎన్ కౌంటర్
బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఉదయం 8.30 గంటల సమయంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు (encounter) జరిగాయని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ పి ఒక ప్రకటనలో తెలిపారు. భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ కోసం వెళ్తుండగా మావోయిస్టులు దాడి చేశారని ఐజీపీ తెలిపారు. బీజాపూర్ దంతెవాడ, సుక్మా ట్రై జంక్షన్ లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో, శుక్రవారం రాష్ట్ర డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), బస్తర్ ఫైటర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఉదయం 8.30 గంటల సమయంలో పిడియా గ్రామం వైపు బలగాలు వెళ్తుండగా మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దాంతో అక్కడ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.