posted on Mar 22, 2024 11:33AM
బీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఆమె బెయిల్ పిటిషన్ విచారణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీం పేర్కొంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం(మార్చి 23) విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అలాగే కవిత బెయిల్ పిటిషన్పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. పిటిషన్లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ నెల 15 న ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు.