వరుస లొంగుబాట్లుతో దిక్కుతోచని స్థితిలో మావోయిస్టు పార్టీ
వరుస లొంగుబాట్లు, అరెస్టులతో తెలంగాణలో మావోయిస్టు పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిందని పోలీసులు తెలిపారు. అనేక మంది దళ సభ్యులు, దళ నాయకులు ముఖ్యంగా యువనాయకులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకుంటున్నారన్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు వారి ఉనికి కాపాడుకోవడానికి చేస్తున్న చర్యలు, మావోయిస్టు పార్టీ వల్ల ఏజెన్సీ ప్రాంతానికి జరుగుతున్న నష్టం పట్ల విసుగు చెంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మావోయిస్టు పార్టీని విడిచి బయటకు రావడానికి సముఖంగా ఉన్నారన్నారు. కానీ మావోయిస్టు (Maoist)అగ్ర నాయకులు లొంగిపోవాలని నిర్ణయించుకున్న దళ సభ్యులను వేరే ప్రాంతాలకు బదిలీ చేయడం, దళం నుంచి పారిపోయిన వారిని తిరిగి పట్టుకుని వేధించడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.