చనిపోయిన నక్సలైట్లు వీరే..
గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక పోరాట విభాగం సీ-60, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్విక్ యాక్షన్ టీంకు చెందిన పలు బృందాలు మంగళవారం ఉదయం గడ్చిరోలి అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. రేపన్ పల్లి సమీపంలోని కోలామర్క పర్వతాల్లో సీ-60 యూనిట్ బృందం గాలింపు చేపడ్తుండగా.. వారిపై నక్సలైట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, దంతో, భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు (encounter) జరిపారని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా నలుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిపై రూ.36 లక్షల నగదు బహుమతి ఉందని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీ, ఒక కార్బైన్, రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన నక్సలైట్లను వివిధ నక్సల్స్ కమిటీల కార్యదర్శులు వర్గీష్, మగ్తూ, ప్లాటూన్ సభ్యులు కుర్సాంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేష్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.