- దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ నియామకం
- 2009లో మాండసోర్ నుంచి ఎంపీగా గెలుపొందిన మీనాక్షి
- 9 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ లను నియమించిన ఏఐసీసీ
తొమ్మిది రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ లను ప్రకటించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన దీపాదాస్ మున్షీని తొలగించింది. ఆమె స్థానంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమించింది.
మీనాక్షి 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. రాహుల్ టీమ్ లో ఆమె కీలకంగా ఉన్నారు. 1999 నుంచి 2002 వరకు ఆమె ఎన్ఎస్యూఐ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2008లో ఆమెను ఏఐసీసీ కార్యదర్శిగా రాహుల్ ఎంపిక చేశారు. ఆ తర్వాత 2009లో మాండసోర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
దీపాదాస్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి హైకమాండ్ కు పలు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. ఏకపక్షంగా ఆమె నిర్ణయాలను తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేతల మధ్య సమన్వయం నెలకొల్పడంలో కూడా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ ని నియమించారు. తెలంగాణలో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, మణిపూర్, తమిళనాడు, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జ్ లను హైకమాండ్ నియమించింది.