posted on Mar 17, 2024 8:05AM
ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న సమయం రానేవచ్చింది.. ఐదేళ్ల అస్తవ్యస్త పాలన, కక్ష పూరిత రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అధ: పాతాళానికి చేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఇప్పుడు ప్రజలకు వచ్చింది.. వైసీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజల చేతుల్లో ఉన్న ఓటు అస్త్రాన్ని వినియోగించుకునేందుకు ఢమురుకం మోగింది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కలను సాకారం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఏపీ ప్రజల చేతుల్లోకి వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఏపీలో నాలుగో దశలో అంటే.. మే 13వ తేదీన 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా పార్టీల వారిగా సీట్ల కేటాయింపు జరిగింది. జనసేన, టీడీపీ అధిష్టానాలు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మరోవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 24పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.
దేశవ్యాప్తంగా పలు దఫాలుగా పోలింగ్ జరగనుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మొదటి, రెండు దశల్లోనే పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అందరూ భావించారు. దీంతో అధికార వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, జనసేన పార్టీలుసైతం సాధ్యమైనంత మేర నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. అయితే, ఎన్నికల సంఘం మాత్రం పార్టీలకు షాకిచ్చింది. నాలుగో విడతలో అంటే.. మే13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే పోలింగ్ తేదీకి సుమారు రెండు నెలల గడువు ఉంది. దీంతో అభ్యర్థులకు ఖర్చు తడిసిమోపెడు కానుంది. దీంతో ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న అభ్యర్థులలో ఒకింత ఆందోళన వ్యక్తం అవుతోంది. టికెట్ దక్కిన వారు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. అంటే జగన్ మోహన్ రెడ్డి అపద్ధర్మ ముఖ్యమంత్రే. జగన్ ప్రభుత్వం ఇక ఆపద్దర్మ ప్రభుత్వమే. ఈ పరిణామం వైసీపీకి, జగన్ కు, ఆయన పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికరమనే అని చెప్పొచ్చు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రికి రివ్యూ చేసే అధికారం ఉంటుంది. జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే సూచనలు మాత్రమే అమలు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే పాలన మొత్తం అధికారుల చేతుల్లోకి, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో వెళ్తుంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు సుమారు రెండు నెల గడువు ఉండటంతో ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే అవకాశం ఉంటుంది. వేసవి కాలం కావటంతో తాగునీటి సమస్య వచ్చినా, ఇతర ఏ సమస్య వచ్చినా ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ ఇబ్బందులు అని జనం గట్టిగా ఎలుగెత్తుతారు. గతంలోలా ప్రజలు ప్రభుత్వ నిర్భంధం, అణచివేతపై భయపడే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం,
బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికలకు వెళ్తున్నాయి కనుక మూడు పార్టీల్లోని కార్యకర్తల మధ్య సమన్వయం. సయేధ్యా ఏర్పడడానికి, చిన్న చిన్న పొరపొచ్చాలు, అసంతృప్తులు ఉంటే వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగడానికి అవసరమైన సమయం ఉంది. దీంతో మూడు పార్టీల్లో రాష్ట్రస్థాయి నేతల నుంచి గ్రామస్థాయిలోని కార్యకర్తల మధ్య సఖ్యత కుదిర్చే సమయం ఆయా పార్టీల అధిష్టానాలకు దొరికినట్లైంది. ఫలితంగా పోలింగ్ సమయంలో కూటమి అభ్యర్థులకు ఓటు ట్రాన్సఫర్ విషయంలో ఎటువంటి అనుమానాలూ ఉండవు. అలాగే వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్ని ఎన్నికల సంఘం విస్పష్ట ఆదేశాలతో ఎన్నికల్లో వలంటీర్లతో మేలు పొందాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి ఆ దింపుడు కళ్లెం ఆశ కూడా లేకుండా పోయింది. వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. వలంటీర్లను అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లుగాకూడా నియమించుకోకూడదని సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ఈ ఆదేశాలను మీతిమీరితే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఏపీలో ఎన్నికల తేదీకి సుమారు రెండు నెలల గడువు ఉండటంతో వైసీపీలో ఓటమి భయం, తెలుగుదేశం కూటమిలో విజయోత్సాహం కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.