Wednesday, October 16, 2024

పార్టీ పేరు మార్పుతోనే పతనం ప్రారంభమైందా? | brs down fall with party name change| cadre| demand| trs| kcr

posted on Mar 16, 2024 12:10PM

కేసీఆర్ కుమార్తె అరెస్టు బీఆర్ఎస్ ను ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. కవిత అరెస్టునకు వ్యతిరేకంగా జనంలో ఎటువంటి స్పందనా కనిపించకపోవడం, ఆ పార్టీ నాయకత్వాన్నే కాదు, పార్టీ శ్రేణులను కూడా కలవరపరుస్తోంది. అన్నిటికీ మించి  తెలంగాణ సమాజం కవిత అరెస్టును ఒక సాధారణ విషయంగానే పరిగణించడం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇప్పటికే ఆమె అరెస్టు ఆలస్యమైందన్న భావన వ్యక్తం కావడంతో ఆమె అవినీతికి పాల్పడిందన్న విషయాన్ని జనం నమ్ముతున్నారా అన్న అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం, ధరణి.. ఇలా బీఆర్ఎస్ సర్కార్ పై వెల్లువెత్తిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు ఔట్ కమ్ ఆ పార్టీ అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా వచ్చినా జనం ఇలానే ఔను అవినీతి జరిగే ఉంటుందంటూ లైట్ గా తీసుకుంటారా? అన్న భయం బీఆర్ఎస్ నాయకత్వంలో బలంగా వ్యక్తం అవుతోంది.   ఈ పరిస్థితి అసలే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ అండ్ కోను మరింత ఒత్తిడికి లోను చేస్తుందనడంలో సందేహం లేదు.  అన్నిటికీ మించి క్యాడర్ లో పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని తగ్గిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీల్లోకి సర్దుకుంటున్న పరిస్థితుల్లో  పార్టీ క్యాడర్ లో పార్టీ అధినాయకత్వం ఇప్పటి వరకూ చేసిన తప్పిదాలంటూ పలు అంశాలపై విస్తృత చర్చ మెదలైంది.  ఇప్పటికే రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదని సర్వేలన్నీ ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. దీంతో పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువు అన్న పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నది. గతంలో పార్టీ అధినాయకత్వం దర్శనం కోసం ప్రగతి భవన్ గేట్ల ముందు పడిగాపులు కాసిన నాయకులు.. ఇప్పుడు అధినాయకత్వం ఒకసారి కలవండి అని బతిమలాడుతున్నా రావడానికి సుముఖత చూపడం లేదు. ఇటువంటి తరుణంలో కవిత అరెస్టు ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని మరింతగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల కోసం గెలుపు వ్యూహాలు రచించడం కంటే.. తన కుమార్తె కవితను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేయడమే కేసీఆర్ కు ప్రథమ ప్రాధాన్యతగా మారనుందనడంలో సందేహం లేదు. 

 దీంతో బీఆర్ఎస్ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటన్న చర్చ మొదలైంది. ఆ చర్చలో   కేసీఆర్ చేసిన తప్పులు ఇవీ అంటూ కొన్ని ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. వాటిలో మరీ ప్రధానంగా పార్టీ పేరు మార్పు అంశంపై పార్టీ క్యాడర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచీ పార్టీకి ప్రజలతో సంబంధం తెగిపోయిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

తన సొంత రాజకీయ ఆకాంక్షల కోసం పార్టీ భవిష్యత్ ను ఫణంగా పెట్టారన్న ఆగ్రహం క్యాడర్ లో వ్యక్తం అవుతోంది . జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు కేసీఆర్ కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా ప్రజలలో తనకు గుర్తింపు తెచ్చిన, కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన అమ్మలాంటి పార్టీ పేరును మార్చేశారనీ, ఆ నిర్ణయమే కేసీఆర్ ను అధికారం నుంచి కింద పడేసిందని అంటున్నారు.  కేసీఆర్‌  పార్టీ పేరును మార్చడమే ఆయన పతనానికీ, పార్టీ ఇబ్బందులకూ కారణమైందని చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన తరువాత పార్టీ పరాజయం పాలు కావడం ఎంత మాత్రం యాధృచ్ఛికం కాదని జనం అంటున్నారు. తెరాస పేరు మారగానే అప్పటి వరకూ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న అభిమానం, పార్టీకీ, ప్రజలకు ఉన్న అనుబంధం తెగిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే అభిప్రాయంతో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి తరువాత ఒకరిగా కారు దిగిపోతున్నారు.

దీంతో బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోగలుగుతుందా? మనుగడ సాగించ గలుగుతుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా  మార్చాలన్న డిమాండ్ పార్టీ క్యాడర్ నుంచి బలంగా వస్తోంది.   మొత్తం మీద కనుసైగతో  పార్టీని శాసించిన కేసీఆర్ ఇప్పుుడు క్యాడర్ కన్నెర్రకు గురి కావలసిన పరిస్థితికి వచ్చారంటే అది స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana