- హోంగార్డులకు ఇంకా జీతాలు చెల్లించలేదన్న హరీశ్ రావు
- 16 వేలకు పైగా హోంగార్డులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన
- వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్
ఈ నెలలో 12 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలోని 16 వేలకు పైగా హోంగార్డులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా వాతలు అని ఎద్దేవా చేశారు.హోంగార్డులకు ఇంత వరకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. చేతిలో చిల్లిగవ్వలేక హోంగార్డులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు వాళ్లు ఫోన్లు చేసి నిలదీసే పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదని, ప్రజా వ్యతిరేక పాలన అని అన్నారు. హోంగార్డులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.