
- రక్షక భటుల నీడలో.. పెట్రోల్ దొంగల వేట!”
- పోలీసుల ఇలాకాలోనే ‘పెట్రోల్’ పంక్చర్..
- మాస్కులు వేసి మరీ ఖాళీ చేస్తున్నారు!
జనవాహిని ప్రతినిధి తాండూరు : వారు సామాన్యులు కాదు.. రక్షణ కల్పించే రక్షక భటులు నివసించే ప్రాంతం అది. అయినా సరే, దొంగలు తమ ‘చేతివాటాన్ని’ ప్రదర్శించడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాండూరు పట్టణం సాయిపూర్ పరిధిలోని జానకీరాం నగర్ (అయోధ్య నగర్) ఇప్పుడు పెట్రోల్ దొంగల ఆగడాలకు అడ్డాగా మారింది. గత నెల రోజులుగా కాలనీవాసులు తమ బైక్‌లలో పెట్రోల్ మాయం అవుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. అనుమానం వచ్చి కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి, అర్ధరాత్రి వేళల్లో దర్జాగా ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాల వద్దకు వస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే ట్యాంకుల నుంచి పెట్రోల్‌ను కాజేసి పరారవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ కాలనీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ పోలీసు శాఖలో పనిచేసే పలువురు అధికారులు, సిబ్బంది నివాసం ఉంటున్నారు. సాక్షాత్తు పోలీసులే నివసించే కాలనీలో, అది కూడా నెల రోజులుగా వరుసగా పెట్రోల్ దొంగలు తిరుగుతుండడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.మేము పోలీసుల మధ్య ధైర్యంగా ఉంటున్నామనుకుంటే, దొంగలు నేరుగా మా ఇంటి గుమ్మం ముందే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం తాండూరు లో తీవ్ర దుమారం రేపాయి. సీసీ ఫుటేజీలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో పట్టణ ప్రజలు షాక్‌కు గురయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి, ఆ మాస్క్ దొంగలను పట్టుకోవాలని, రాత్రిపూట గస్తీని పెంచాలని జానకీరాం నగర్ నివాసితులు డిమాండ్ చేస్తున్నారు.



