50 బెడ్లతో టెంపరరీ హాస్పిటల్
సమ్మక్క–సారలమ్మ(Sammakka Saralamma) మహాజాతరకు తరలివచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు మేడారంలోనే 50 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలోనే మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర, జిల్లా స్థాయి ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ మేరకు మేడారం జాతరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. మేడారంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. మేడారం వెళ్లే రూట్ లో 42 మెడికల్ క్యాంపులు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి క్యాంపులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అవసరమైన అన్ని రకాల మెడిసిన్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జాతర వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పేషెంట్లను వీలైనంత త్వరగా మెడికల్ క్యాంపులు, సమీపంలోని హాస్పిటళ్లకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. మెడికల్ క్యాంపుల్లో(Medical camp) ట్రీట్‌మెంట్ చేశాక.. ఇంకా ఉన్నతస్థాయి వైద్యం అవసరమైతే ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా హాస్పిటల్స్‌కు, వరంగల్ ఎంజీఎంకు తరలించి చేసి వైద్యం అందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు మేడారం జాతరలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.