బీసీసీఐ ట్రోఫీకి భవిష్య రెడ్డి..!

- బీసీసీఐ అండర్-15 టోర్నీకి తాండూరు క్రీడాకారిణి భవిష్య ఎంపిక
- వరుసగా రెండో ఏడాది అవకాశం..
- హర్షం వ్యక్తం చేస్తున్న కోచ్‌లు, క్రీడాభిమానులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణానికి చెందిన యువ క్రికెటర్ భవిష్య రెడ్డి మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి విజయనగరం వేదికగా జరగనున్న బీసీసీఐ మహిళల అండర్–15 వన్డే ట్రోఫీకి ఎంపికైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో భవిష్య రెడ్డికి చోటు దక్కింది. తాండూరు పట్టణానికి చెందిన కరుణాకర్ రెడ్డి, మమతా రెడ్డిల కుమార్తె అయిన భవిష్య రెడ్డి, చిన్నతనం నుంచే క్రికెట్ పట్ల మక్కువ పెంచుకుంది. స్థానిక సెయింట్ మార్క్స్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న ఆమె, ఆటలోనూ రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. గత ఏడాది కూడా బీసీసీఐ ట్రోఫీకి ఎంపికై అద్భుత ప్రతిభ కనబరిచిన భవిష్య, ఇప్పుడు వరుసగా రెండోసారి ఎంపికై తన నిలకడను చాటుకుంది.తాండూరులోని లెజెండ్స్ క్రికెట్ అకాడమీలో కోచ్‌లు ఎండి సాహిల్, ఎండి సోహిల్ వద్ద భవిష్య శిక్షణ పొందుతోంది. ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించి, జాతీయ స్థాయికి ఎదిగేలా వారు ప్రోత్సహిస్తున్నారు. తాండూరు వంటి పట్టణం నుంచి ఒక క్రీడాకారిణి జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికవ్వడం పట్ల అకాడమీ సభ్యులు మరియు పట్టణ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భవిష్యత్తులో ఆమె భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, అంతర్జాతీయ స్థాయిలో తాండూరు పేరు నిలబెట్టాలని స్థానికులు ఆకాంక్షించారు.





