మత్తుకు విట్టల్ రెడ్డి విరుగుడు..!

- అక్రమ మద్యం నిల్వలపై ఎస్ఐ మెరుపు దాడులు
- రెండు బెల్టు షాపుల సీజ్.. భారీగా మద్యం స్వాధీనం
- ఇద్దరు నిందితులపై కేసు నమోదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు సమీపంలోని రాజీవ్ కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ మద్యం దందాను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం రాజీవ్ కాలనీ మరియు ఇందిరమ్మ కాలనీలలో ఎస్సై విట్టల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.చట్టవిరుద్ధంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. రాజీవ్ కాలనీకి చెందిన మాల వెంకటప్ప (తండ్రి రామప్ప) నిర్వహిస్తున్న బెల్టు షాపులో 71 బాటిళ్ల (11.980 లీటర్లు) మద్యాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా, సగ్గం నారాయణ (తండ్రి శంకరయ్య) అక్రమంగా నిర్వహిస్తున్న మరో షాపుపై దాడి చేసి 82 బాటిళ్ల (13.240 లీటర్లు) మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న వెంకటప్ప, నారాయణలపై ఎక్సైజ్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్సై విట్టల్ రెడ్డి మాట్లాడుతూ…. గ్రామాలు, కాలనీల్లో అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరైనా అనుమతి లేకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై రౌడీషీట్లు తెరిచేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అక్రమ విక్రయాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.





