అంతారంలో ఫ్లెక్సీల వివాదం..!

- రాజకీయ కక్షతోనే ఫ్లెక్సీల చింపివేత?
- ఉప సర్పంచ్ వడ్డే రవి ఫ్లెక్సీల ధ్వంసం
- మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవ: సద్దుమణిగిన బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం.
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని అంతారం గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చింపివేత కలకలం రేపింది. ఈ ఘటన రెండు రాజకీయ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. అంతారం గ్రామ ఉప సర్పంచ్, బిఆర్ఎస్ యువ నాయకుడు వడ్డే రవి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని గ్రామంలోని ఎస్సీ కాలనీ పోచమ్మ కట్ట నుండి చర్చి వరకు మరియు వడ్డే గల్లీలో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉప సర్పంచ్ రవి ఫోటో ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు.
విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ నాయకుల పనేనంటూ బిఆర్ఎస్ వర్గీయులు ఆరోపించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య మాట మాట పెరిగి పరస్పరం గొడవకు దిగారు.సమాచారం అందుకున్న తాండూరు పట్టణ పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరంగా ముందుకు వెళ్లాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సంయమనం పాటించాలని ఆయన ఆదేశించడంతో బిఆర్ఎస్ నాయకులు శాంతించారు.ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు. ఫ్లెక్సీలు చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు.





