- ఎమ్మెల్యేకు దమ్ముంటే ఎదుర్కో..!
- దౌర్జన్యాలు చేస్తే దడ పుట్టిస్తాం!
- చైర్మన్ ఎవరో చెప్పలేక చేతులెత్తేసిన చేతకాని ప్రభుత్వం
- బీఆర్ఎస్ గ్రాఫ్ చూసి కాంగ్రెస్‌లో వణుకు
- తాండూరు గడ్డపై అరాచకాలు సాగనివ్వం: పైలెట్ రోహిత్ రెడ్డి హెచ్చరిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే అసమర్థతపై మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, అధికారం ఉంది కదా అని అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు.మున్సిపల్ చైర్మన్ పదవికి, కౌన్సిలర్ల ఎంపికకు సంబంధించి నిర్ణయం తీసుకునే సత్తా కూడా ఎమ్మెల్యేకు లేదని రోహిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కనీసం మీ పార్టీ చైర్మన్ ఎవరో ప్రకటించుకోలేని స్థితిలో మీరు ఉన్నారు, ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?” అని ప్రశ్నించారు. సొంత పార్టీని చక్కదిద్దుకోవడం చేతగాక, ప్రతిపక్షాలపై పడటం సిగ్గుచేటన్నారు.నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఎమ్మెల్యేలో భయం మొదలైందని రోహిత్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయడం చేతగాక, దౌర్జన్యాలు చేయడం ద్వారా ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ క్యాడర్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు అండగా తాను ముందుంటానని భరోసా ఇచ్చారు.తాండూరులో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తూ, గుండాగిరి చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలని, లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని హితవు పలికారు. అరాచక పాలనపై పోరాటం ఉధృతం చేస్తామని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో తాండూరు మున్సిపల్ గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. 36 వార్డ్ లలో దాదావు 30 వార్డ్ లు బిఆర్ఎస్ పార్టీ నే గెలవబోతుందని దమ్ముంటే డీ కొట్టాలని ఎమ్మెల్యే కు రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు.






