
- ఓటర్ల నమోదులో కాంగ్రెస్ కుట్ర..!
- అధికార బలంతో దొంగ ఓట్ల నమోదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి అడ్డదారులు తొక్కుతోందని, అధికార బలంతో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయిస్తోందని బిఆర్ఎస్ పార్టీ 29వ వార్డు ఇంచార్జ్ విజయ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.29వ వార్డులో కాంగ్రెస్ నాయకులు తమకు అనుకూలంగా ఉండేలా కుట్రలు పన్నుతున్నారని విజయ్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండానే, కేవలం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు దొంగ ఓట్లను ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని మండిపడ్డారు. కేవలం 29వ వార్డులోనే సుమారు 500కు పైగా దొంగ ఓట్లను కొత్తగా చేర్చారు. స్థానికంగా నివాసం ఉండని వ్యక్తుల పేర్లను, తప్పుడు చిరునామాలతో జాబితాలోకి ఎక్కించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద నమ్మకం లేకనే ఇలాంటి దొంగ ఓట్లపై ఆధారపడుతోంది అని విజయ్ విమర్శించారు.అధికార పార్టీ చెప్పినట్లు వింటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. వెంటనే ఆ 500 అక్రమ ఓట్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



