posted on Sep 17, 2024 11:04AM
వృద్ధులకు ఎట్టకేలకు ఒక సంక్షేమ పథకం ప్రారంభమైంది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానం మేరకు డెబ్భ య్యేళ్లు, అంతకు పైబడినవారికి ఆయుష్మాన్ భారత్ , ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను వర్తింప చేస్తోంది. వృద్ధుల ఆరోగ్య భద్రతకు సంబంధించినంత వరకూ ఇది అతి ప్రధానమైనదని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఆరోగ్య బీమా పథకంలో ఉన్న లోటుపాట్లను ఇది భర్తీ చేస్తుంది.
సామాజిక, ఆర్థిక స్థితిగతు లతో సంబంధం లేకుండా దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలలో ఆరుకోట్ల మందికి పైగా వృద్ధులకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుంది. దీనికి కేంద్ర మంత్రివర్గం గత వారం ఆమోద ముద్ర వేసింది. దీని వల్ల ఖజానాపై రూ. 3437 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రైవేట్ సంస్థల, ఇ.ఎస్.ఐ బీమా పథకాలను అనుభవిస్తున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం తీసుకున్నవారు ఈ పథకానికి, తాజా పథకానికి మధ్య ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బీమా పథకానికి కొన్ని పరిమితులున్నాయి. దీని కింద వృద్ధు లకు 5 లక్షల రూపాయల వరకే బీమా సౌకర్యం లభిస్తుంది. ఒక కుటుంబంలో ఒకరిని మించి వృద్ధులున్న పక్షంలో వారిద్దరూ ఈ పథకాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. దేశంలో వృద్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందువల్ల ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చడమనేది హర్షించాల్సిన విషయమే. ముఖ్యంగా వృద్ధులకు ఆరోగ్యం ప్రధాన అవసరంగా ఉన్న స్థితిలో ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ముదావహం.
నిజానికి దేశంలో ఆరోగ్య బీమా వర్తిస్తున్న వృద్ధుల సంఖ్య అతి తక్కువ. సి.జి.హెచ్.ఎస్ తో సహా ప్రస్తుతం అమలులో ఉన్న అనేక ఆరోగ్య పథకాలు ఆస్పత్రులలో చేరిన వారికి, సంబంధిత ఖర్చులకు మాత్రమే వర్తిస్తాయి. ఓపీడీలకు, ఔట్ పేషెంట్ సేవలకు వర్తించవు. నిజానికి, సుమారు 60 శాతం రోగుల విషయంలో రోగ నిర్దారణ పరీక్షలకు, మందులకు ఎక్కువగా ఖర్చవుతుంటుంది. ఇతర దేశాల్లో ఇటువంటి బీమా పథకాలు అమలు జరుగుతున్న తీరును పరిశీలించి, ఆరోగ్య బీమాను కొత్త విభాగాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది.