posted on Sep 17, 2024 3:02PM
హైదరాబాద్‌లో గణేశ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ప్రశంసనీయంగా జరుగుతోంది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటలకే పూర్తయిపోయింది. వేలాదిమంది భక్తుల జయజయధ్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గ్.లోని నాలుగో నంబర్ క్రేన్ దగ్గర సప్తముఖ ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శోభాయాత్రకు సెక్రటేరియట్ సమీపంలో స్వాగతం పలికారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
సాధారణంగా ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశ విగ్రహ నిమజ్జన కార్యక్రమం చాలా ఆలస్యంగా జరిగేది. నిమజ్జనం రోజు ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాతో, మర్నాటి తెల్లవారుఝామునే నిమజ్జనం జరిగేది. ఈసారి మాత్రం పకడ్బందీ ప్రణాళికతో చాలా త్వరగానే నిమజ్జనాన్ని పూర్తి చేశారు. అలాగే నిజమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు పెద్దగా ఇబ్బందులేవీ తలెత్తలేదు. మొత్తానికి గతంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమాలకు, ఈ ఏడాది జరిగిన కార్యక్రమాలకు మధ్య చాలా ప్రశంసనీయమైన మార్పు కనిపిస్తోంది.