posted on Sep 17, 2024 5:33PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చలనం మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం వున్నంతకాలం ఈ కేసును అణిచేశారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో వివేకా కుటుంబానికి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం నాడు అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వివేకా హత్య విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆమెతోపాటు ఆమె భర్త కూడా వచ్చారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఆయనకు పీఏగా వున్న కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు తమపై అక్రమ కేసు పెట్టారని, ఆ ఫిర్యాదు వెనుక వున్న నిజానిజాలను వెలికి తీయడానికి విచారణ జరిపించాని సునీత ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలను బయటకి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనకు అన్ని విషయాలూ తెలుసునని, తప్పకుండా విచారణ జరిపిస్తానని సునీతకు హామీ ఇచ్చారు. అలాగే పులివెందులకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలు ఏదో జరగబోతోందన్న సూచనలు అయితే ఇస్తున్నాయి.