posted on Sep 17, 2024 6:37PM
ప్రభుత్వాలు ‘బుల్డోజర్ న్యాయం’ పద్ధతిని పాటించే విషయంలో సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు విచారణలో ఉన్న నేరస్తుల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులను బుల్డోజర్లతో కూల్చేసే పద్ధతిని పాటిస్తున్నాయి. ఈ విషయంలో దేశస్థాయిలో మార్గదర్శకాల తయారీ కోసం మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వాదనలు విన్న అనంతరం అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1వ తేదీ వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి కూల్చివేతలను ఆపితే ఆక్రమణల తొలగింపు కష్టమవుతుందన్న ప్రభుత్వాల ప్రతినిధులను సుప్రీంకోర్టు బెంచ్ తిరస్కరించింది. ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుందన్న ప్రభుత్వాల అభ్యంతరాలను కొట్టిపారేసింది. “తదుపరి విచారణ తేదీ వరకు మీ చర్యలను ఆపినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు” అని న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఈ నెలలో ఇప్పటికే రెండుసార్లు అనేక రాష్ట్రాలు చేపట్టిన బుల్డోజర్ చర్యల మీద సుప్రీం కోర్టు బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కూల్చివేతలను హీరోయిజంగా చూపే యత్నం చేయవద్దని ప్రభుత్వాలను హెచ్చరించింది. తమ అనుమతులు లేకుండా ఎటువంటి కూల్చివేతలు చేపట్టొద్దని తేల్చిచెప్పింది. ప్రభుత్వ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపు విషయంలో మాత్రం తమ ఆదేశాలు వర్తించవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.