posted on Sep 16, 2024 4:36PM
వైసీపీలో మంచి వాగ్ధాటి ఉన్న నాయకులలో మాజీ మంత్రి బుగ్గన ముందు వరుసలో ఉంటారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అంటే జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా బుగ్గన పీఏపీ చైర్మన్ గా వ్యవహరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.
అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన కేవలం ఢిల్లీలో కూర్చుని జగన్ ప్రకటించిన ఉచిత పథకాలు నెరవేర్చుందుకు అప్పులు సంపాదించడం అన్న పనికే పరిమితమయ్యారు. అది వేరే సంగతి. దీంతో బుగ్గన ప్రతిష్ఠ మసకబారింది. ప్రజలలో పలుచన అయ్యారు. దాంతో 2024 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో వైసీపీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారం కోల్పోవడమే కాదు.. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా మిగిలిపోయింది. ఆ పార్టీ తరఫున కేవలం 11 మంది మాత్రమే ఎన్నికయ్యారు. సరే ఆ సంగతలా ఉంచితే… ఓటమి తరువాత బుగ్గన తన నియోజకవర్గాన్నే కాదు, రాష్ట్రాన్ని కూడా వదిలేశారు.
ఓటమి తరువాత ఇప్పటి వరకూ రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఆయన ఇప్పటి వరకూ రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. ఆ రెండు సార్లూ కూడా ఆయన హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ పెట్టారు. మొదటి సారి అసెంబ్లీలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలపై మాట్లాడారు. రెండో సారి తాజాగా సోమవారం (సెప్టెంబర్ 16)న మీడియాతో మాట్లాడారు. ఈ సారి ఆయన పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదంపై మాట్లాడారు. పోలవరం సవరించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేయడాన్ని తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయనకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే హక్కు ఉంది. దానిని ఎవరూ కాదనరు. అయితే ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి హైదరాబాద్ లోనే మీడియా సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్న దానికి బుగ్గన సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఓటమి తరువాత ఇంత వరకూ ఒక్కసారి కూడా సొంత నియోజవర్గంలో అడుగుపెట్టని బుగ్గన తగుదునమ్మా అని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏపీ సర్కార్ పై విమర్శలు గుప్పించడంలో ఆంతర్యమేమిటన్నది ఆయన చెప్పాల్సి ఉంది.
ఒక వైపు వైసీపీ అధినేత జగన్ తాను స్వయంగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటూ పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు నియోజకవర్గాలను వదిలేసి హైదరాబాద్ లో ఉంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ రివ్యూ మీటింగ్ లో నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారంటూ జగన్ పార్టీ నేతలపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయినా పార్టీ నేతలెవరూ ఖాతరు చేసిన దాఖలాలు లేవు. చాలా మంది పార్టీ ఓటమి తరువాత హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు మకాం మార్చేశారు. వారిలో చాలా మంది అరెస్టు భయంతో వణికి పోతున్నారు. ఇక బుగ్గన అందుకు మినహాయింపేమీ కాదు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకల్లో బుగ్గన చాలా చాలా కీలకం. ఆర్థిక మంత్రిగా ఆయన పాత్రే కీలకం ఆ కారణంగానే బుగ్గన కూడా అరెస్టు భయంతోనే ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టడం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ.