posted on Sep 16, 2024 6:09PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. అంతే వెంటనే ఆయనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే పవన్ జానీవాకర్ పై కేసు నమోదైందని తెలియగానే సస్పెన్షన్ వేటు వేశారు. ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరఫున జానీ మాస్టర్ చురుకుగా పాల్గొన్న సంగతి తెలిసిందే.
అంతే కాకుండా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి, పవన్ కల్యాణ్ కు సన్నిహితంగా మెలిగే వ్యక్తి అయినా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా జానీ మాస్టర్ పై పవన్ కల్యాణ్ సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే జానీ మాస్టర్ సినీ పరిశ్రమలో కొరియా గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పదవి నుంచి జానీ మాస్టర్ కు ఉద్వాసన పలకాలని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సోమవారం (సెప్టెబర్ 16)నే ఈ మేరకు చర్య తీసుకోవాలని అసోసియేషన్ భావించినప్పటికీ, అసోసియేషన్ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం (సెప్టెంబర్ 17) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జానీ మాస్టర్ కు ఉద్వాసన పలికేందుకు నిర్ణయించింది.
ఇలా ఉండగా జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఇలా కేసు నమోదు కాగానే అలా జానీ మాస్టర్ పై జనసేన సస్పెన్షన్ వేటు వేసింది. జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అలాగే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా జానీ మాస్టర్ ను దూరం పెట్టింది.