posted on Sep 16, 2024 5:59PM
చైనా దేశ ఫైనాన్షియల్ క్యాపిటల్ నగరం షాంఘైను భారీ తుఫాను ‘బెబింకా టైఫూన్’ బెంబేలెల్తిస్తోంది. గత 70 సంవత్సరాలతో పోలిస్తే ఇదే అతి పెద్ద తుఫాను అని చైనా వాతావరణ శాఖ చెబుతోంది. ఈ తుఫాను కారణంగా షాంగైలో ప్రజా జీవితం చిన్నాభిన్నమైంది. సోమవారం నాడు గంటకు 151 కిలోమీటర్ల వేగంతో తుపాను షాంఘై నగరాన్ని తాకింది. సాధారణంగా షాంఘై నగరం తుఫాన్లు వచ్చే ప్రాంతం కాదు. 1949లో వచ్చిన టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన భారీ తుపాను ఇదే. దీంతో ఆదివారం రాత్రి నుంచి షాంఘైలోని రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు నిలిపివేశారు. పార్కులు, వినోద ప్రదేశాలను మూసేశారు. ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్సులో యాగి తుపాను నానా యాగీ చేసింది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సెల్ ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు జనం ఇబ్బందిపడ్డారు.