posted on Sep 16, 2024 12:04PM
వరద సమస్య తగ్గుముఖం పడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ పరిపాలన మీద పూర్తి దృష్టి పెట్టబోతున్నారు. సోమవారం నాడు చంద్రబాబు గుజరాత్ పర్యటనకి వెళ్ళి వచ్చాక, వీలు చూసుకుని ఒకటీ రెండు రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇదేదో రొటీన్‌గా జరిగే భేటీ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 20వ తేదీతో వంద రోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల పాటు ఏయే ఎమ్మెల్యే ఎలాంటి పనితీరు కనబరిచారు అనే అంశం మీద వారి దగ్గర్నుంచే చంద్రబాబు సమాచారం తీసుకుని, రివ్యూ చేయబోతున్నారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు మీద చంద్రబాబు ఆగ్రహంగా వున్నట్టు సమాచారం. ఒక మహిళా ఎమ్మెల్యే భర్త తీరు మీద చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. ఆ మహిళా ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నుంచి షాక్ పొందబోతున్నారు. ఆ ముగ్గురు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయిగే కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం కార్యకర్తలను పట్టించుకోకుండా వైసీపీ కార్యకర్తలను వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. అలాంటి వారిని కూడా చంద్రబాబు హెచ్చరించనున్నట్టు తెలుస్తోంది.
షాకింగులు, వార్నింగుల సంగతి అలా వుంచితే, చంద్రబాబు త్వరలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభవార్తలు కూడా వినిపించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మొదటగా 18 కార్పొరేషన్లకు ఛైర్మన్ల పేర్లను ప్రకటించే అవకాశం వుంది. అలాగే మిగతా అన్ని నామినేటెడ్ పదవులను దసరా లోపు భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.