Thursday, November 28, 2024

పొయ్యి మీద పెట్టకుండానే నూనె కాగుతుంది… ఎలా? | edible oil price hike| edible oil

posted on Sep 14, 2024 2:24PM

పొయ్యి మీద పెట్టకుండానే నూనె సలసలా కాగుతోంది. అవునా.. నిజమా అనుకుంటున్నారా? అవును ఇది పాక్షికంగా నిజమే. ఇది ఏ మ్యాజిక్కో కాదు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా నూనె ప్యాకింగ్‌లో వుండగానే సలసలా కాగుతోంది. ఎందుకంటే, వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. దానివల్ల వంట నూనె ధరలు భారీగా పెరగబోతున్నాయి. పండగలు వస్తున్నాయి.. పిండివంటలు చేసుకుంటాం. ఇలాంటి సమయంలో నూనెల ధరలు పెంచితే ఎలా అని బాధపడుతున్నారా? మీరెంత బాధపడినా ఉపయోగం లేదు. కేంద్రం డెసిషన్ తీసుకుంది. ఇది ఫైనల్ అంతే! 

ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మీద ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా 20 శాతం దిగుమతి సుంకాన్ని దేశ ప్రజలకు కానుకగా ఇచ్చింది. అలాగే రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ మీద ఇప్పటి వరకు 12.5 శాతం వున్న దిగుమతి సుంకాన్ని దేశ ప్రజల మీద ప్రేమతో 32.5 శాతానికి పెంచారు. ఈ దిగుమతి సుంకాల పెంపు మాత్రమే కాకుండా, అదనంగా అగ్రికల్చరల్ సెస్‌ని కూడా వడ్డిస్తారు. దాంతో వంటనూనెలు పొయ్యిమీద పెట్టకుండానే ప్యాకింగ్‌లోనే కాగిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతారు… పండగ చేసుకోమంటారు.. ఎలామరి? ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద మనసు చేసుకుని నూనెల ధరలు ఎందుకు పెంచిందో తెలుసా? ఇలా ధరలు పెంచడం వెనుక చాలా గొప్ప కారణం వుంది. వంట నూనెల దిగుమతుల కారణంగా దేశంలో నూనెగింజల్ని సాగుచేసే రైతులు నష్టపోతున్నారట. ఇప్పుడు దిగుమతి చేసుకునే నూనెల ధరలు పెంచడం వల్ల నూనెగింజల్ని సాగుచేసే రైతులకు మేలు జరుగుతుందట. అందుకే కేంద్రం నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచిదట. దీనికీ, దానికీ సంబంధం ఏంటని ఆలోచించి బుర్ర హీటెక్కుతోందా? ఒకవైపు నూనె ఎలాగూ హీటెక్కింది. దాని గురించి ఆలోచించి బుర్రలు కూడా హీట్ చేసుకోవడం అవసరమా? నూనె అవసరం అనుకుంటే, తక్కువ నూనెతో వంటలు చేసుకోండి. అది కూడా మా వల్ల కాదు అంటే, నీళ్ళతో ట్రై చేయొచ్చేమో ఆలోచించండి. అంతేగానీ, ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే, పేదవాడి ఆలోచన బుర్రకు చేటు!

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana