విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శం
విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ వంశీకృష్ణతో కలిసి ధర్మారం మండలం నందిమేడారం, కటికనపల్లి గ్రామాల్లో రెండు 33/11 కేవి సబ్ స్టేషన్ ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డు లో ధర్మారం, వెల్గటూరు, గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పాలకులు సృష్టించిన అపోహలను పటాపంచలు చేస్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి ఉండే విద్యుత్ డిమాండ్ ను అంచనా వేస్తూ దాని సాధన దిశగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్ స్టోరేజ్ ఎనర్జీ మొదలగు రంగాలలో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.