Sunday, October 20, 2024

నీవు నేర్పిన విద్యయే.. కేసీఆర్ కు రేవంత్ షాక్! | revanth shock to kcr| appoint| arekapudi| gandhi| pac| chairman

posted on Sep 11, 2024 10:01AM

ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి దిమ్మ‌తిరిగే షాకిచ్చారా? గ‌తంలో కేసీఆర్ ప్ర‌యోగించిన ఫార్ములానే ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పై రేవంత్ ప్ర‌యోగించారా..?  అంటే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంగా ఉన్నారు. హైకోర్టు తీర్పు వ‌చ్చిన కొద్ది గంట‌ల్లోనే పీఏసీ (ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ) చైర్మ‌న్ ఎంపిక విష‌యంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌ద్వారా బీఆర్ఎస్ నేత‌ల‌కు హైకోర్టు తీర్పు సంతోషం గంటల సేపు కూడా మిగలకుండా ఆవిరైపోయింది. 

శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్  త‌ర‌పున విజ‌యం సాధించిన అరెక‌పూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మ‌న్ గా నియమించింది. ఈ నియామకం సరికొత్త చర్చకు దారితీసింది. ఇటీవ‌ల అరెక‌పూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న‌ట్లు అంద‌రూ భావించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన అరెక‌పూడి గాంధీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నేత‌లు రేవంత్ స‌ర్కార్ ను ఇరుకుపెట్టే ప్ర‌య‌త్నం చేశారు.  తాజాగా అరికపూడి గాంధీ బీఆర్ఎస్ నేత‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాననీ,  కాంగ్రెస్  లో చేర‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. హరీష్ రావుకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా? వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోరా..? అంటూ ప్రశ్నించారు.

అసెంబ్లీ నిబంధనల ప్ర‌కారం ప్ర‌తిప‌క్ష‌  బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు స‌భ్యుల‌ను పీఏసీకి ఎన్నుకోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి హ‌రీశ్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్ పేర్ల‌ను సూచించారు. అయితే,  కాంగ్రెస్ పార్టీ ముగ్గురు స‌భ్యుల‌ను ఎన్నుకుంది. వారిలో వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్ తోపాటు అరెక‌పూడి గాంధీల‌ను ఎన్నుకుంది. గాంధీని పీఏసీ చైర్మ‌న్ గా ఎంపిక చేయ‌డంపై బీఆర్ఎస్ నేత‌లు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారనీ..ఆయనకు పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఇస్తారంటూ గ‌గ్గోలు పెడుతున్నారు. నిజానికి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌కే ఇవ్వ‌టం ఆన‌వాయితీగా వ‌స్తుంది. టెక్నిక‌ల్ గా అరెక‌పూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. రూల్స్ ప్ర‌కార‌మే గాంధీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌టం జ‌రిగింద‌ని కాంగ్రెస్ చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇది బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వికోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు పేరును ఇచ్చిన‌ప్ప‌టికీ.. అరెక‌పూడి గాంధీ నామినేష‌న్ వేయ‌డంతో కాంగ్రెస్ ఆయ‌నకే ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. 

పీఏసీ చైర్మ‌న్ ఎంపిక విష‌యంలో కాంగ్రెస్ పార్టీ గ‌తంలో కేసీఆర్ అనుస‌రించిన విధానాన్నే అమ‌లు చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. 2 018 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ రెండో సారి విజ‌యం సాధించిన త‌రువాత కేసీఆర్ ప్ర‌తిప‌క్షానికే పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చే ఆన‌వాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టారు. పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి కాంగ్రెస్ లోనే కొన‌సాగుతున్న ఎమ్మెల్యేల‌కు ఇవ్వాల‌ని అప్ప‌ట్లో కాంగ్రెస్ విజ్ఞ‌ప్తి చేసింది. కానీ, కేసీఆర్ కాంగ్రెస్ విజ్ఞ‌ప్తులు ప‌ట్టించుకోలేదు. మిత్ర‌ప‌క్షమైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల‌ను బీఆర్ఎస్ పార్టీలో చేర‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోయింద‌ని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు పీఏసీ చైర్మ‌న్ విష‌యంలో అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని అప్ప‌ట్లో బీఆర్ఎస్ నేత‌లు పేర్కొన్నారు. ఇప్పుడు అదే విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. పీఏసీ చైర్మ‌న్ ఎంపిక‌కు కావాల్సిన ప‌ద‌మూడు మంది బ‌లం ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.  మ‌రోవైపు అరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాన‌ని చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాలతో అనర్హత వేటు ఎదుర్కొనే అవకాశం ఉందన్న సూచనలతోనే అరికపూడి గాంధీ తెలివిగా ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి మింగలేక..కక్కలేక అన్నట్లుగా తయారైంది.

అరెక‌పూడి గాంధీ వివాదరహితుడు. ఆయన తెలుగుదేశంలో ఉన్న సమయంలో కానీ, ఆ తరువాత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ  ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ల‌కుండా  పార్టీ ఆదేశాల మేరకే నడుచుకున్నారన్న పేరుంది.  అయితే, రెండో ద‌ఫా బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని గాంధీ ఆశించారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గాంధీ.. తన సామాజిక వర్గం కోటాలో త‌న‌ను కాద‌ని జూనియర్‌కు మంత్రిగా అవకాశం ఇవ్వడం జీర్ణించుకోలేక పోయార‌ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ స‌మ‌యంలో అధిష్టానం తీరుపై అల‌క‌బూన‌డంతో కేటీఆర్ రంగంలోకిదిగి బుజ్జ‌గించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అన్ని అర్హ‌త‌లూ ఉన్నా.. త‌న‌కు బీఆర్ఎస్ పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌ని గాంధీ అసంతృప్తిగా ఉంటూ వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు అరెస్టు విష‌యంలో కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను పార్టీ నేత‌ల వ‌ద్ద గాంధీ త‌ప్పుబ‌ట్టార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా గాంధీ విజ‌యం సాధించారు. త‌న‌కు స‌న్నిహితుడైన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడ‌ని మొద‌టి నుంచి ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌ల ఆయ‌న రేవంత్‌రెడ్డిని క‌ల‌వ‌డంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా గాంధీ మాట్లాడుతూ.. అభివృద్ధిలో భాగ‌స్వాముడిని అయ్యేందుకు, రేవంత్ పిలుపు మేర‌కు ఆయ‌న్ను క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, కానీ, కాంగ్రెస్ పార్టీలో చేర‌లేద‌ని గాంధీ చెప్ప‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana