Monday, October 28, 2024

అడ్డెడ్డే… ఇది పెద్ద కష్టమే! | russia population problem| population problem to russia| russia population

posted on Sep 10, 2024 3:03PM

మిగతా విషయాల్లో ఏమోగానీ, ఒక విషయంలో మాత్రం మన ఇండియాని తలదన్నే దేశం ప్రపంచంలోనే లేదు. ఆ ఒక్క విషయంలో మాత్రం మన ఇండియన్స్ ఉద్ధండపిండాలే! ఇంతకీ ఆ ఒక్క విషయం ఏంటా అని ఆలోచనలో పడి, ఎక్కడకెక్కడికో వెళ్ళిపోయి, ఏదేదో ఊహించుకోకండి. ఎక్కువ సస్పెన్స్ లేకుండా  అదేంటో నేనే చెప్పేస్తా. అదేనండీ.. పిల్లల్ని కనడం. అవునండీ బాబు.. పిల్లల్ని కనే విషయంలో మన ఇండియన్ల తర్వాతే ఎవరైనా! దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నట్టుగా… మనం మన గురజాడ గారి అడుగుజాడల్లో నడుస్తూ మన దేశాన్ని జనాభాలో నంబర్‌వన్ దేశంగా నిలిపాం. రాబోయే రోజుల్లో ఏ దేశమూ మనకు పోటీగా నిలవకుండా వుండాలని ‘ఆ’ కృషిని నిరంతరం కొనసాగిస్తున్నాం. మన పరిస్థితి ఇలా వుంటే ఆ రష్యా పరిస్థితి మరోలా వుంది. గత కొద్ది సంవత్సరాలుగా రష్యాలో పుట్టే పిల్లల సంఖ్య దారుణంగా పడిపోయిందట. వయసు పైబడినవారు టపా కట్టేస్తున్న సంఖ్య మాత్రం పెరుగుతూనే వుందిగానీ, పుట్టేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా వుంది. ఇలా అయితే రష్యాలో జనాభా భారీ స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం వుందని ఆ దేశంవాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు. 

ఈ ఏడాది జూన్ వరకు రష్యాలో ఐదు లక్షల 99 వేల 6 వందల మంది పిల్లలు పుట్టారు. ఇది గత ఏడాదితో పుట్టిన పిల్లల సంఖ్యతో పోలిస్తే 16 వేలు తక్కువ. పుట్టేవాళ్ళ నంబర్ ఇలా తగ్గిపోతే, పోయేవాళ్ళ నంబర్ మాత్రం పెరిగిపోయింది. ఈ ఏడాదిలో జూన్ వరకు చూస్తే, 3 లక్షల 25 వేల వందమంది చనిపోయారు. గత ఏడాది పోయినవాళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇది 49 వేలు ఎక్కువ. అంటే ఏంటి? అప్‌లోడ్ ఎక్కువైపోయింది. డౌన్‌లోడ్ తక్కువైపోయింది. అంతేకాకుండా, పిల్లల్ని కనడంలో తమవంతు కృషి చేయాల్సిన రష్యన్ యూత్‌లో 15 వేలమంది ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో చనిపోయారు. రష్యాలో జనాభా సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే గుడ్డిలో మెల్లలాగా ఈ మధ్యకాలంలో రష్యాకి వలస వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. దాంతో జనాభా సంఖ్య ప్రాబ్లం కొద్దిగా కవర్ అవుతోంది. అయినా సరే, జనాభాని ఇలా పెంచడం కాదు.. మనమే కష్టపడి పెంచాలని రష్యావాళ్ళు అనుకుంటున్నారు. దీనికోసం ‘ప్రత్యేక జనాభా ఆపరేషన్’ అనే కార్యక్రమాన్ని రష్యా ప్రభుత్వం చేపట్టింది. అదేంటీ… పిల్లల్ని తగ్గించడానికి ఆపరేషన్లు చేస్తారు కదా అనుకుంటున్నారు కదా? ఇది మీరు అనుకుంటున్న ఆపరేషన్ కాదు… జననాల సంఖ్య పెంచడానికి రష్యా ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకం. ఈ పథకం ప్రకారం రష్యాలో ఏ మహిళ అయినా పది లేదా అంతకంటే ఎక్కువ పిల్లల్ని కంటే ఆ మహిళకు మిలియన్ రూబెల్స్.. అంటే మన ఇండియా కరెన్సీలో 13 లక్షల రూపాయలు ఇస్తారట. కాకపోతే దీనికి ఒక కండీషన్ కూడా వుంది. అదేంటంటే, ఆ మహిళ మినిమమ్ పదిమంది పిల్లల్ని కనాలి. పదో బిడ్డ మొదటి పుట్టినరోజున ఈ డబ్బు రష్యా ప్రభుత్వం ఆ తల్లికి ఇస్తుంది. దీని వెనుక ఇంకో తిరకాసు కూడా వుందండోయ్… పదో బిడ్డ పుట్టినరోజు జరుపుకునే రోజు నాటికి ఆ పది పిల్లల పిల్లి.. సారీ.. పది పిల్లల తల్లి తాలూకు మిగతా తొమ్మిది మంది పిల్లలు జీవించే వుండాలి. అదీ విషయం. ఇలా వరసబెట్టి పది పిల్లల్ని కనేసి క్యాష్ ప్రైజ్ తీసుకోవాలని చాలామంది రష్యన్ లేడీస్‌కి వున్నప్పటికీ, ఈ కండీషన్ల కారణంగా కాంపిటీషన్లోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారట. మొత్తానికి రష్యాకి పెద్ద కష్టమే వచ్చి పడింది. అయినా ఇలాంటి విషయాలు మన ఇండియన్లని చూసి నేర్చుకోవచ్చు కదా!

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana