posted on Aug 31, 2024 10:26AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ , రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా శనివారం తెల్లవారు జాము నుంచీ హైదరాబాద్ నగరంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. జల్లుగా మొదలైన వర్షం క్రమంగా జోరందుకుంది.
దీంతో నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లపై నీరు చేరింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అంతా ముసురుపట్టినట్లు మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.