posted on Aug 31, 2024 8:58AM
ఆంధ్రప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాంద్ర, కోస్తా రాయలసీమల్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా రాష్ట్రంలో జనం ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బెజవాడ నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండపాలెంలో శుక్రవారం ఆగస్టు 30) రాత్రి నుంచి కుండపోతగా వర్షం పడుతోంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
ఈ తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.తీర ప్రాంతాలలో శనివారం 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందనీ, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్న ఐఎండీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.