Thursday, October 17, 2024

కొల్లం గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ | red sandal smuggler kollam gangireddi bjp entry| break| purandeswari| say| false

posted on Aug 30, 2024 10:06AM

ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీవ్ర మైన నేర చరిత ఉన్న కొల్లం గంగిరెడ్డి ఎంట్రీకి బీజేపీ ఎలా అనుమతి ఇచ్చిందన్న ఆశ్చర్యం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందన్న అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. అయితే ఆదంతా వట్టిదేనని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖండించారు. అయితే గత కొన్ని రోజులుగా గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం, బీజేపీ మౌనం వహించడం పలు అనుమాలకూ, సందేహాలకూ తావిచ్చింది. అసలు ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీలో తుపాను ముందు ప్రశాంతతా అనిపించేలా భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. 

ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామే. రాష్ట్రంలో కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ ఇటీవలి ఎన్నికలలో మంచి ఫలితాలనే సాధించింది. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోగలిగింది. ఇదంతా తెలుగుదేశం, జనసేనలతో పొత్తు కారణంగానే అన్న విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు లేదు. అది పక్కన పెడితే రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి అయిన బీజేపీలో జోష్ కనిపించాలి. కానీ  రాష్ట్రంలో ఆ పార్టీ అసలు ఉందా అన్నట్లుగా విస్మయకర రీతిలో సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నది. ఎక్కడా ఎటువంటి హడావుడీ లేదు. పార్టీ క్యాడర్, లీడర్ అందరూ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం గత ఐదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ హడావుడి చాలా చాలా ఎక్కువగా ఉండేది. మరీ ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశంపై విమర్శలు గుప్పించడం, అధికార వైసీపీకి మద్దతుగా నిలవడమే ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న లక్ష్యం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. 

ఆ తరువాత పురంధేశ్వరి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత కూడా బీజేపీ రాష్ట్రంలో క్రియాశీలంగానే ఉంది. జగన్ సర్కార్ అక్రమాలపై పురంధేశ్వరి తరచూ గొంతెత్తేవారు. జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై ఎన్నికలకు ముందు  ఆమె హస్తిన వెళ్లి మరీ కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తరువాత అంటే ఎన్నికల ఫలితాల తరువాత నుంచీ బీజేపీలో అంతా నిశ్శబ్దమే తాండవిస్తోంది.   కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ ఎటువంటి హడావుడి లేకుండా నిశబ్ధంగానే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలి ఎన్నికలలో  పార్టీ సీనియర్లను బీజేపీ హైకమాండ్ దూరం పెట్టింది. ఎన్నికలలో పోటీకి టికెట్ లు నిరాకరించడమే కాకుండా, ప్రచారానికి కూడా రానివ్వలేదు. దీంతో వారంతా పార్టీ కార్యకలాపాలకు  దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉంటారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు, గెలిచిన ఎమ్మెల్యేలూ కూడా నిశ్శబ్దాన్నే ఆశ్రయించడం పట్ల రాజకీయవర్గాలలో సైతం విస్మయం వ్యక్తమౌతోంది. అటువంటి నిశ్శబ్దంలోంచే గంగిరెడ్డికి కమలం తీర్థం అన్న వార్తలు ఒక్కసారిగా బయటకు రావడంతో ఇంకా జగన్ కోసం బీజేపీ రాష్ట్ర శాఖ పాకులాడుతోందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. జగన్ హయాంలో గంగిరెడ్డి స్మగ్లింగ్ వ్యవహారాలన్నీ ఎంతో స్వేచ్ఛగా నిర్వహించుకున్న సంగతి విదితమే. ఇప్పుడు గంగిరెడ్డిని బీజేపీ తన గూటికి చేర్చుకోవడం ద్వారా బహుశా రాష్ట్ర బీజేపీలో జగన్ అభిమానులను సంతృప్తి పరిచి వారి అలక తీర్చడానికేనని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.   దానికి తోడు నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్న వారి జాబితాలో బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఆ విశ్లేషణలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి.  

ఏపీలో జగన్ ఉన్న ఐదేళ్ల కాలంలో ఆయన బీజేపీ అడుగులకు మడుగులొత్తారు. రాష్ట్ర ప్రయోజనాల ఊసే లేకుండా తన కేసుల నుంచి రక్షణ ఉంటే చాలన్నట్టుగానే వ్యవహరించారు. అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ గంగిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. ఆ పార్టీ హైకమాండ్ ఇంకా జగన్ కు వత్తాసు పలుకుతోందన్న ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతుంది. ఈ భయంతోనే గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నిజానికి గత రెండు మూడు రోజులుగా జరిగిన ప్రచారం మేరకు  బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో గండిరెడ్డి గురువారం ( ఆగస్టు 29) బీజేపీ గూటికి చేరాల్సి  ఉంది. అయితే అదంతా ఒట్టి ప్రచారం మాత్రమేనని పురంధేశ్వరి కుండబద్దలు కొట్టేశారు.అసలు కొల్లం గంగిరెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పిన పురంధేశ్వరి.. బీజేపీలో అడ్డగోలు చేరికలకు అసలు ఆస్కారమే లేదని చెప్పారు.

గంగిరెడ్డి బీజేపీ గూటికి చేరుతున్నారన్న వార్తలు తనకు మీడియా ద్వారానే తెలిశాయనీ, అయితే అవన్నీ పూర్తి అవాస్తవాలని పురంధేశ్వరి విస్పష్టంగా తేల్చేశారు. అయితే ఎవరు పడితే వారు బీజేపీ గూటికి చేరలేరన్న ఆమె, పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవారికి మాత్రమే బీజేపీలో ఎంట్రీ ఉంటుందని, అది కూడా ఆయా జిల్లాల కార్యవర్గం ఆమోదంతోనే అనీ వివరణ ఇచ్చారు.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana