ఏది ఏమైనప్పటికీ మన దేశం చాలా గొప్పది. తమ పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు నాలుగు పీకితే చప్పుడు చేయకుండా కూర్చుంటారు. కొంతమంది తల్లిదండ్రులు తమకు సంబంధించిన వేరే టెన్షన్లని పిల్లల్ని చావగొట్టి తగ్గించుకుంటారు.. ఈ రకంగా పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత చావబాదినా మన దేశంలో నేరం కాదు. అయితే, జర్మనీలో మాత్రం ఇది చాలా పెద్ద నేరం. పిల్లల్ని చావగొట్టే సంగతి అలా వుంచండి, వాళ్ళని కొట్టే ఉద్దేశంతో అలా ముట్టుకున్నా సరే అది పెద్ద నేరమై కూర్చుంటుంది. నన్ను మా పేరెంట్స్ కొట్టారు అని ఆ పిల్లలు పోలీసులకు చెప్పినా, ఎవరైనా చూసి పోలీసులకు చెప్పినా ఇక ఆ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఇలాంటి పరిస్థితి మన ఇండియా నుంచి వెళ్ళిన పేరెంట్స్.కి జర్మనీలో ఎదురైంది. థానే ప్రాంతానికి చెందిన జంట జర్మనీలో నివసిస్తోంది. ఓసారి వాళ్ళ కూతురు ఏదో అల్లరి చేస్తే, నా కూతురే కదా అని ఏదో కొద్దిగా చెయ్యి చేసుకున్నారు. అంతే, ఈ ఘోరాన్ని ఇరుగుపొరుగు వాళ్ళు చూశారు.. పోలీసులకు మోసేశారు. దాంతో పోలీసులు రెచ్చిపోయారు. ఆ తల్లిదండ్రుల మీద కేసు పెట్టారు. వాళ్ళ కూతుర్ని పిల్లల సంరక్షణ కేంద్రానికి తరలించేశారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడేళ్ళయింది. ఇక్కడ పిల్ల, అక్కడ తల్లిదండ్రులు లబోదిబో అంటున్నారు. కోర్టుని తల్లిదండ్రులు మా కూతుర్ని మాకు ఇచ్చేయండి కుయ్యో అంటే, లేదు, మీ కూతుర్ని మీరు కొట్టి చంపేస్తారు అందువల్ల మీ కూతుర్ని మీకు ఇచ్చేదే లేదు అని కోర్టు తేల్చి చెబుతోంది. సంరక్షణ కేంద్రంలో వున్న కూతురు నేను నా పేరెంట్స్ దగ్గరకి వెళ్ళిపోతాను మొర్రో అంటే, నో, మీ పేరెంట్స్ నిన్ను కొట్టి చంపేస్తారు అని రిజెక్ట్ చేస్తోంది. ఈ విషయాన్ని థానె పార్లమెంట్ సభ్యుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్ళారు. వీలైనంత త్వరగా ఆ కూతుర్ని, తల్లిదండ్రులను కలిపి, ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని జై శంకర్ హామీ ఇచ్చారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.
పిల్లలను కొట్టడం లేదా శారీరకంగా శిక్షించడం జర్మనీలో నేరంగా పరిగణించబడుతుంది. జర్మనీ 2000లో పిల్లలపై శారీరక దండనను నిషేధించింది, అలా చేసిన మొదటి దేశాలలో ఒకటిగా నిలిచింది. పిల్లలు శారీరక హింస లేకుండా పెరిగే హక్కును కలిగి ఉంటారని చట్టం పేర్కొంది. వారి పిల్లలపై శారీరక బలాన్ని ఉపయోగించే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు జరిమానాలు లేదా నేరారోపణలను సదరు చట్టం ద్వారా ఎదుర్కోవాల్సి వుంటుంది. జర్మన్ సివిల్ కోడ్ సెక్షన్ 1631 ప్రకారం, “పిల్లలకు శారీరక లేదా మానసిక హింస లేకుండా పెరిగే హక్కు ఉంది.” జర్మన్ క్రిమినల్ కోడ్ సెక్షన్ 223 పిల్లలకు శారీరక హాని కలిగించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తుంది.